పతనం అంచున కర్ణాటక సర్కారు?
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీయూ సర్కారు పతనం దిశగా పయనిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం ఒక్కరోజే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టడంతో సర్కారు కుప్పకూలుతుందన్న భయాందోళనలు రెండు పార్టీలో నెలకొన్నాయి. ఓ జేడీఎస్ ఎమ్మెల్యే సహా 11మంది ముంబయిలో మకాం వేసినట్లు వార్తలు వస్తున్నాయి. విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కుమారస్వామి సర్కారు శుక్రవారం మధ్యాహ్నం శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ను అడ్డుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని గవర్నర్ వజుభాయ్ వాలాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుంటే బడ్జెట్ సమావేశాలు నిలిచిపోతాయని ప్రభుత్వం ఆందోళన పడుతోంది. విప్ జారీ చేసినా బుధవారం 9మంది ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. గురువారం ఈ సంఖ్య 20కి చేరడం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత నెలలో ఏర్పాటుచేసి కాంగ్రెస్ శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశానికి గైర్హాజరైన నలుగురు ఎమ్మెల్యేలు రమేశ్ జార్కి హోళి, మహేశ్ కుమతహళ్లి, బి.నాగేంద్ర, ఉమేశ్ జాదవ్ ఇప్పటివరకు ఆచూకీ లేదు. శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై చర్చ జరిగి ఓటింగ్‌కు ప్రతిపక్ష బీజేపీ పట్టుబడితే పరిస్థితి ఏంటన్నది కాంగ్రెస్, జేడీఎస్ ఆలోచిస్తున్నాయి. గురువారం హాజరుకాని 20 మంది ఎమ్మెల్యేలు నేడు కూడా రాకపోతే ప్రభుత్వం కూలిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.