హోదా దీక్ష’ గ్రాండ్ సక్సెస్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన ఒక రోజు ధర్మ పోరాట దీక్ష ఘన విజయం సాధించింది. దాదాపు 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఏపీ భవన్‌లో జరిగిన ఈ దీక్షా శిబిరానికి హాజరై చంద్రబాబుకు, ప్రత్యేక హోదా కు మద్దతు ప్రకటించారు. దేశం మొత్తం తమ ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్ద తు ప్రకటించిందని ముఖ్యమంత్రి చం ద్రబాబు వ్యాఖ్యానించారు. ‘మనం ఏకాకులం కాదు. అన్ని రాజకీయ పార్టీ లు మనతో ఉన్నాయనే బలం మనకు చేకూరింది’ అని ఆయన చెప్పారు. రోజు ధర్మ పోరాట దీక్ష ద్వారా నైతిక విజయం సాధించామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించటం మనం సాధించిన విజయమని చంద్రబాబు ధర్మపోరాట దీక్షను విరమిస్తూ ప్రకటించారు. ‘యావత్ దే శాన్ని కదిలించగలిగాం. మనకు జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజలకు తెలియచేయగలిగాం’ అన్నారు. మంగళవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాఫెల్ ఒప్పందంలో ఒక దళారిగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. విభజన హామీల కింద రాష్ట్రానికి ఒక లక్ష కోట్ల రూపాయలు రావలసి ఉన్నదని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించితీరుతామని ధీమా వ్యక్తం చేశారు. హిట్లర్‌గా వ్యవహరిస్తున్న మోదీని అందరం కలిసి కట్టిడి చేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
బల ప్రదర్శనలో విజయం
ప్రధాన మంత్రి మోదీకి తమ బలాన్ని ప్రదర్శించటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధించారు. ఒక రోజు ధర్మ పోరాట దీక్షకు వచ్చిన నాయకులందరూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టమైన ప్రకటన చేయటం గమనార్హం. బీజేపీయేతర పార్టీలకు చెందిన నాయకులతోపాటు ఒకప్పుటి బీజేపీ సీనియర్ నాయకులు యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హా తదితరులు ధర్మ పోరాట దీక్షకు హాజరయ్యారు. ప్రత్యేక హోదాకు తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్, మాజీ ప్రధాన మంత్రులు మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, దేవేగౌడ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాంనబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత అహమద్ పటేల్, మరో సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబుబ్దుల్లా, జేడీ నాయకుడు శరద్ యాదవ్, ఎన్‌సీపీ నాయకుడు ఆనంద్ కిశోర్, ఎస్‌పీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్, రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు డెరిక్ ఒబ్రియాన్, డీఎంకే నాయకుడు శివ, ఆర్‌ఎస్‌పీ పార్లమెంటు సభ్యుడు ఎంకే పరమేశ్వరన్ తదితర నాయకులు ధర్మ పోరాట దీక్షకు హాజరై ప్రత్యేక హోదాకు తమ మద్దతు ప్రకటించారు. ధర్మ పోరాట దీక్షకు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రధాని మోదీ నిరంకుశ పాలనా విధానాన్ని తీవ్రంగా ఖండించారు. మోదీ ఇప్పటికైనా తమ వ్యవహారాశైలిని, మాట్లాడే విధాన్ని మర్చుకోవాలని హితవు పలికారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర విభజన హామీ అనీ, దీనిని అమలు చేయకపోవటం ధర్మం కాదని దీక్ష సందర్భంగా మాట్లాడిన నాయకులంతా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీని అమలు చేయవలసిన బాధ్యత ప్రస్తుత ప్రధాన మంత్రిగా ఉన్నదని వారు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటాన్ని ఈ నాయకులంతా అభినందించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, ఢిల్లీకి కూడా వచ్చి జాతీయ స్థాయిలో పోరాటం చేయటాన్ని వారంతా ప్రశంసించారు. ఈ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు నాయకులందరు ధర్మ పోరాట దీక్షా వేదికపై నుండి ప్రకటించడం ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పడానికి ఓ నిదర్శనం. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు, పనె్నండు గంటల పాటు జరిగిన ధర్మ పోరాట దీక్షకు జాతీయ పార్టీల నాయకులు వంతుల వారీగా వస్తునే ఉన్నారు. వచ్చిన ప్రతి నాయకుడు మొదట చంద్రబాబును అభినందించిన అనంతరం ప్రసంగిస్తూ ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటిస్తూ, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోదీ రెండు నెలల్లో ప్రధాన మంత్రి అధికార నివాసాన్ని ఖాళీ చేయకతప్పదని డెరిక్ ఒబ్రియాన్ జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించినప్పటి నుండి ప్రతిపక్షాల మధ్య సమైక్యత పెరిగిందని ఆయన చెప్పారు. చంద్రబాబుకు తమ మద్దతు ఇక మీదట కూడా కొనసాగుతుందని ఎస్‌పీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో పర్యటించాలని ఆయన చంద్రబాబును కోరారు. ఉత్తరప్రదేశ్ రాజకీయమే దేశంలో మార్పు తెస్తుంది కాబట్టి చంద్రబాబు అక్కడ పర్యటించాలని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేస్తామని ములాయం సింగ్ అన్నారు. విభజన హామీలను ఇప్పుడు కూడా పూర్తి చేయకపోతే ఎలా అని ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి దీక్ష చేసినా అధికారంలో ఉన్న వారు స్పందించకపోవటం సిగ్గు చేటని ఆయన దుయ్యబట్టారు. నాలుగున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్నా విభజన హామీలు అమలు చేయకపోతే ఎలా అని ఆయన నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ కూడా అమలు కాకపోతే ఎలా అని, కేంద్రం కక్షతో వ్యవహరించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదని పవార్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీయేతర ప్రభుత్వం విభజన హామీలను నెరవేరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హోదా సాధనకు మీ వెంట తామున్నామని చంద్రబాబుకు మల్లికార్జున ఖర్గే భరోసా ఇచ్చారు.

చిత్రం.. ధర్మ పోరాట దీక్షకు హాజరై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపిన నేతలు ములాయంగ్ సింగ్ యాదవ్ (సమాజ్‌వాది పార్టీ), ధర్మేంద్ర యాదవ్, డెరెక్ ఒబ్రియాన్ (తృణమూల్ కాంగ్రెస్), తిరుచి శివ (డీఎంకే), శరద్ యాదవ్ (ఎల్‌జేడీ), జైరామ్ రమేష్ (కాంగ్రెస్) తదితరులు