తగిన జాగ్రత్తలతో ప్రీటెర్మ్ పిల్లలు సురక్షితం
నెలలు నిండక ముందే పుట్టే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్లు జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుందనిఅన్నారు కిమ్స్ సవీర వైద్యులు. ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే (నెలల నిండక ముందు పుట్టిన శిశువులు)ని కిమ్స్ సవీర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ కు చెందిన సీనియర్ నవజాత శిశువులు, చిన్నపిల్లల వైద్యలు డా. ఏ. మహేష్, డా. మనోహర్ గాంధీ, డా. గిరిధర్, డా. మౌనిక, స్త్రీ వైద్య నిపుణులు డా. గీతారాణి, డా. ఉదయని, డా. శృతి, హాస్పిటల్ సీఈఓ డా. పిఎస్ ప్రసాద్, మెడికల్ సూపరిండెంట్ డా. అబిబ్ రాజా, సీఓఓ సిద్దారెడ్డి లు పాల్గొన్నారు.
సరైన ఆస్పత్రిలో, అన్ని సదుపాయాలు ఉన్నచోట, జాగ్రత్తలు తీసుకోగలిగే వైద్యులు కూడా ఉన్నచోట ప్రసవం అయ్యేలా చూసుకుంటే పిల్లలకు ఇక ఎలాంటి ఢోకా ఉండబోదని అన్నారు. ఇంతమందిని ఇక్కడ ఒకేసారి చూడడం ఎంతో ఆనందంగా ఉందని, వీళ్లంతా నెలలు నిండకముందే పుట్టినా ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నారని తెలిపారు.
డా. మహేష్, డా. గీతారాణి మాట్లాడుతూ “ప్రతి ఎనిమిది మంది పిల్లల్లో ఒకరు నెలలు నిండకముందే, అంటే 37 వారాల గర్భం పూర్తికాక ముందే పుడతారు. తల్లికి బాగా ఎక్కువగా రక్తపోటు, మధుమేహం ఉండి, అవి నియంత్రణలోకి రాకపోవడం, ముందుగానే నొప్పులు రావడం, ఉమ్మనీరు లీక్ అవ్వడం ఇలాంటి కారణాలతో ముందే పుడతారు. సరైన సమయంలో, సరైన ఆస్పత్రిలో ప్రసవం ప్లాన్ చేసుకుంటే 90% మంది పిల్లలు బాగానే ఉంటారు. సాధారణంగా తల్లులకు స్టెరాయిడ్స్ ఇస్తాము. అది ఇచ్చిన 24 గంటల తర్వాత ప్రసవం అయితే పిల్లలు బాగుంటారు. అలాగే, మెదడును సంరక్షించేందుకు మెగ్నీషియం సల్ఫేట్ ఇంజెక్షన్ కూడా ఇస్తాం. దీనివల్ల పిల్లల మెదడు బాగుంటుంది. ఎన్ఐసీయూ సదుపాయం ఉన్నచోట ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకోవాలి. సీపాప్ లాంటి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. శ్వాసపరమైన సమస్యలు ఉన్న పిల్లలకు అవసరమైన మందులు వెంటనే ఇవ్వగలగాలి. ఇన్ఫెక్షన్ రాకుండా చూ సుకోవడం, వస్తే నియంత్రించడం, సరైన సమయానికి తల్లిపాలు ఇవ్వడం, కంగారూ మదర్ కేర్ లాంటి వాటి ద్వారా చాలామందికి సాధారణ జీవితం ఇవ్వగలం” అన్నారు.
డా. పిఎస్ ప్రసాద్, డా. అబిబ్ రాజాా, సిద్దారెడ్డిలు మాట్లాడుతూ, “నెలలు నిండకముందే పుట్టే పిల్లల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం, పుట్టిన వెంటనే అవసరాన్ని బట్టి తగిన వైద్యం అందించడం ద్వారా వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కిమ్స్ సవీర ఆస్పత్రిలో ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ కోసమే ఏర్పాటు చేశాం. ఇక్కడ తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. ఎంతోమంది నిపుణులైన వైద్యులు ఉండడంతో నెలలు నిండకముందే పుట్టే పిల్లలకు సాధారణ జీవితం అందించగలుగుతున్నాం. ప్రీమెచ్యూరిటీ అనే కాన్సెప్ట్ మీద అవగాహన కోసమే ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెలల నిండక ముందు జన్మించిన శిశువులు, వారి తల్లిదండ్రులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.











