దమ్ముంటే అరెస్ట్ చేయండి : కేటీఆర్

హైదరాబాద్ 9 సెప్టెంబర్ 2025: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్‌ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. తన అరెస్టుపై కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. తన అరెస్టు కోసం కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తనను అరెస్టు చేసుకోండి… తనకు అరెస్టు భయం లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్.

తన అరెస్టుతో సీఎం రేవంత్‌రెడ్డికి పైశాచిక ఆనందం తప్పా మరొకటి రాదని ఆక్షేపించారు. తాను ఏ తప్పు చేయలేదని… ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు. తనతో రేవంత్‌రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్‌కు రావాలని ఛాలెంజ్ చేశారు. తనపై ఏసీబీ కేసు ఉందని… రేవంత్‌రెడ్డిపై కూడా ఏసీబీ కేసుందని గుర్తుచేశారు. ఆర్ఎస్(రేవంత్, సంజయ్) బ్రదర్స్‌కు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఆర్ఎస్ బ్రదర్స్‌కు .. తాను ఏ కారులో తిరుగుతున్నానో‌ మాత్రమే కావాలని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.