కోకాపేట వేలం భూముల డబ్బులు తిరిగి ఇచ్చే వివాదం
కోకాపేట వేలం భూముల డబ్బులు తిరిగి ఇచ్చే వివాదం పరిష్కారం పై పత్రికా ప్రకటన
నిధుల సమీకరణ కోసం కోకాపేట గ్రామంలోని కొన్ని భూములను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఎ ( హైదరాబాద్ మహానగర అభివృధ్ధి సంస్ధ) కు కేటాయించింది. అనంతరం సం.2000 నుంచి 2006 ల మధ్య హెచ్ఎండీఎ ఆ భూములలో కొన్నింటికి వేలం నిర్వహించింది. హుడా ( హైదరాబాద్ అర్బన్ డెవెలప్ మెంట్ అధారిటీ) /హెచ్ఎండీఎ ద్వారా గోల్డెన్ మైల్- I, II & III మరియు ఎంపైర్-I & II పేరిట 166 ఎకరాల భూమిని 2006 నుంచి 2008 మధ్యకాలంలో వేలం ద్వారా విక్రయించడం జరిగింది. 12 మంది బిడ్డర్లు( వేలంలో పాల్గొన్న కొనుగోలుదారులు) సదరు 166 ఎకరాల భూమిని రూ.1755.51 కోట్లకు వేలం ద్వారా స్వంతం చేసుకున్నారు. వేలం పాటలో ఎకరానికి ధర రూ.6.10 కోట్ల నుంచి రూ. 14.45 కోట్లు పలికింది. వేలం పాట దారులు (బిడ్డర్లు)వెంటనే ఈఎండీ చెల్లించడంతో పాటుగా రెండు మరియు మూడు విడుతలుగా 10 నుంచి 70 శాతం ధరను కూడా చెల్లించారు. కాగా కొనుగోలు దారులు చెల్లించిన మొత్తం 2007-08 వరకు రూ. 687 కోట్లు చేరింది. కాని వేలంలో పాల్గొన్న కొనుగోలుదారులు నియమాలకు అనుగుణంగా నిర్ధారిత సమాయానుసారం మిగిలిన సొమ్మును చెల్లించలేదు. మిగిలిన రూ.1068 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో కొనుగోలుదారులు హైకోర్టులో వాజ్యం వేశారు. ఆ తరువాత సుప్రీంకోర్టులో కూడా ఆ భూముల యాజమాన్య హక్కులు వివాదంలో ఉన్నాయంటూ వాజ్యం వేశారు.
సుప్రీంకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత అక్టోబర్, 2017లో ఆ వేలం వేసిన భూములపై యాజమాన్య హక్కులు ఉన్నవని, హెచ్ఎండీఎ కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఆ తరువాత 2019, జనవరి 8 న సుప్రీంకోర్టు వేలంలో భూమి కొనుగోలు చేసిన వివాదంలో తీర్పునిస్తూ, కొనుగోలుదారులు కోరితే, వారు చెల్లించిన నిధుల ప్రకారం ప్రో-రేటా పద్దతిన భూమిని కేటాయించాలని, పూర్తిగా నిధులు (మిగిలిన నిధులు) 8 వారాలలో చెల్లించేందుకు సిద్ధపడితే, అందుకు అనుగుణంగా వారికి సదరు భూమిని కేటాయించాలని తీర్పు నిచ్చింది. కాగా 2 బిడ్డర్లు( కొనుగోలు దారులు) ప్రో- రెటా పద్దతిన వారు చెల్లించిన నిధులకు గాను భూమిని తీసుకోవాడానికి సిధ్ధ పడ్డారు. మిగతావారు 8 వారాలలో మిగిలిన నిధులు చెల్లించి మొత్తం భూమిని తీసుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఒక బిడ్డరు (కొనుగోలుదారుడు) మాత్రమే కేసు వాయిదా కోరడం జరిగింది.
సుప్రీంకోర్టు తీర్పు వల్ల హెచ్ఎండీఎ కు సుమారు రూ.800 కోట్ల రూపాయలు సమకూరనుంది. వేలం వేసిన భూముల స్ధలాలకు హద్దులను అందుకు అనుగుణంగా నిర్ణయించడం జరిగింది.
ఇట్లు,
ఎం. రాం కిషన్, సెక్రటరీ, హచ్ఎండీఎ.
తేదిః02-02-2019……………………………………………జారీ చేసిన వారు పిఆర్ఓ, హెచ్ఎండీఎ.