కుంభమేళా: త్రివేణీ సంగమంలో స్నానానికి పోటెత్తిన జనం

కుంభమేళాలో స్నానమాచరించడానికి ప్రధానమైన రోజుల్లో ఒకటైన మౌని అమావాస్య నాడు కోట్ల సంఖ్యలో యాత్రికులు స్నానాలు ఆచరించారు. గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమంలో స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం.

ఈ నెల 4న త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(అలహాబాద్)కు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి యాత్రికులు పోటెత్తారు. వీరు కిలోమీటర్ల కొద్దీ నడిచి స్నానాల ఘాట్ల వద్దకు చేరుకున్నారని ప్రయాగ్‌రాజ్‌లోని బీబీసీ ప్రతినిధి వికాస్ పాండే తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు దారితీసే ప్రతీ వీధి జనంతో నిండిపోయిందని చెప్పారు.