గాంధీ బొమ్మను ‘షూట్’ చేసిన హిందూ మహాసభ నేత పూజా పాండే అరెస్టు
మహాత్మా గాంధీ బొమ్మను ఎయిర్ పిస్టల్‌తో కాల్చిన హిందూ మహాసభ నాయకురాలు పూజా పాండేను అలీగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన రోజైన జనవరి 30న హిందూ మహాసభ నిర్వహించిన ఒక ‘వేడుక’లో పూజ ఈ పని చేశారు.
గాడ్సే బొమ్మకు పూలమాల వేసిన తర్వాత గాంధీ బొమ్మను పూజ మూడుసార్లు షూట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గత వారం వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యింది. దీనిని హిందూ మహాసభే విడుదల చేసిందని భావిస్తున్నారు.
వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పూజ అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూజను, వీడియోలో పూజతోపాటు ప్రముఖంగా కనిపిస్తున్న ఆమె భర్త ఆచూకీని గుర్తించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే వారం వ్యవధిలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు అనుమానితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారి నీరజ్ జదావున్ బీబీసీతో చెప్పారు.