ఈడీ: రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి?

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 12వ తేదీన జైపూర్‌లోని ఈడీ కార్యాలయంలో జరగనుంది.

ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి? ఆ కేసుల్లో ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి?

యునైటెడ్ కింగ్‌డమ్ ఆస్తుల కేసు

లండన్‌లోని 12, బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.17.77 కోట్లు) విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని, ఈ ఆస్తి రాబర్ట్ వాద్రాకు చెందినదేనని ఈడీ ఆరోపిస్తోంది.

బ్రయాన్‌స్టోన్‌లోని భవనంతోపాటు 4 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.37.42 కోట్లు) విలువైన మరో రెండు ఆస్తులు, 5 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.46.77 కోట్లు) విలువైన ఇంకో రెండు ఆస్తులు… మొత్తం 6 భవనాలు వాద్రాకు ఉన్నాయని ఈడీ భావిస్తోంది. ఈ భవనాలన్నింటి ఖరీదు రూ. వంద కోట్లపైమాటేనని అంచనా వేస్తోంది. 2005 నుంచి 2010వ సంవత్సరం మధ్యలో ఈ ఆస్తులను కొనుగోలు చేశారు.

బికనీర్ భూముల కేసు

బికనీర్ సమీపంలోని కొలాయట్‌లో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ స్కై లైట్ హాస్పిటాలిటీ భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని 2015 సెప్టెంబర్‌లో ఈడీ కేసు నమోదు చేసింది. పేద గ్రామాల పునరావాసానికి సంబంధించిన భూములు అవి.

69.55 హెక్టార్ల (సుమారు 173 ఎకరాల) భూమిని రూ.72 లక్షలకు కొనుగోలు చేసి.. అక్రమ లావాదేవీల ద్వారా రూ.5.15 కోట్లకు అల్లెగెన్సీ ఫిన్‌లీజ్ అనే సంస్థకు అమ్మేశారని ఈడీ చెబుతోంది.

అల్లెజెన్సీ అనే సంస్థకు అసలు వాస్తవంగా ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలూ లేవని, ఇదొక నకిలీ సంస్థ అని తమ విచారణలో తేలినట్లు ఈడీ వివరించింది.