ఫారెస్ట్ అధికారుల వేధింపులు గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం
డెక్కన్ న్యూస్ ములుగు: ఫారెస్ట్ అధికారుల వేధింపులు భరించలేక రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన ఓ గిరిజన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని సీపీఎం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కే. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఫారెస్ట్ అధికారి జయశ్రీ వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతులపై వేధింపులు కొనసాగితే జిల్లా ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.











