ఏఐ హెల్త్ ఫీచర్లతో శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌వాచ్‌లు

డెక్కన్ న్యూస్, బిజినెస్ : శామ్‌సంగ్ తన తాజా స్మార్ట్‌వాచ్‌లైన గెలాక్సీ వాచ్ అల్ట్రా2 మరియు గెలాక్సీ వాచ్9లను భారత మార్కెట్లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అధునాతన ఏఐ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ, ఎక్కువ బ్యాటరీ లైఫ్, మరింత ప్రకాశవంతమైన డిస్‌ప్లేతో ఈ రెండు వాచ్‌లను రూపొందించింది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులకు మల్టీ-బైపై రూ.9,500 వరకు తగ్గింపు, రూ.1,500 విలువైన కూపన్లు, రూ.3,500 వరకు అప్‌గ్రేడ్ డిస్కౌంట్, రూ.3,500 వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో పాటు 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ వంటి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

గెలాక్సీ వాచ్ అల్ట్రా2 ప్రధానంగా అడ్వెంచర్, ట్రెక్కింగ్, ట్రైల్ రన్నింగ్, డైవింగ్ వంటి అవుట్‌డోర్ కార్యకలాపాల కోసం రూపొందించబడింది. ఇందులో 800mAh భారీ బ్యాటరీ, 5,000 నిట్స్ ప్రకాశవంతమైన డిస్‌ప్లే, టైటానియం బాడీ, కొత్త ట్రైల్ రన్, డైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు గెలాక్సీ వాచ్9 రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇది 40mm, 44mm వేరియంట్లలో అందుబాటులో ఉండగా, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, సౌకర్యవంతమైన డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ రెండు వాచ్‌లలోనూ ఏఐ ఆధారిత ఆరోగ్య ఫీచర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. నిద్ర నాణ్యత, గుండె ఆరోగ్యం, వ్యాయామ తీవ్రత, ఫిట్‌నెస్ స్థాయి, వినికిడి సామర్థ్యాన్ని నిరంతరం విశ్లేషించి వ్యక్తిగత ఆరోగ్య సూచనలను అందిస్తాయి. ఆరోగ్య సంరక్షణను మరింత వ్యక్తిగతీకరించాలనే లక్ష్యంతో ఈ కొత్త వాచ్‌లను అభివృద్ధి చేసినట్లు శామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ తెలిపారు.