విదేశాలకు వెళ్లే వారిలో అమ్మాయిలే అధికం
ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లడం విద్యార్థులందరికీ ఓ కల. ఈ కలను సాకారం చేసుకోవడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. గత సంవత్సరం భారతదేశం నుంచి అమెరికాకు రికార్డు స్థాయిలో 82,500 ఎఫ్1 (విద్యార్థి) వీసాలు వస్తే, అందులో అత్యధికులు అమ్మాయిలే కావడం విశేషం! టీ హబ్ సహకారంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫారిన్ స్టడీస్ (ఐఎంఎఫ్ఎస్) నిర్వహించిన ‘గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023’ కార్యక్రమంలో పలువురు వక్తలు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.
విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన 100కి పైగా విదేశీ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. టీఎస్‌సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు, టీపీఎస్‌సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.పట్టాభి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఎఫ్ఎస్ హైదరాబాద్ విభాగం భాగస్వామి అజయకుమార్ వేములపాటి మాట్లాడుతూ, ‘‘గత ఆరేడేళ్లుగా మన దేశం నుంచి విదేశీ విద్యకు వెళ్లే అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతోంది. తల్లిదండ్రులు, పిల్లలు.. ఇద్దరి ఆలోచనాతీరులో వస్తున్న మార్పే ఇందుకు ప్రధాన కారణం. 80లు, 90ల తర్వాత చాలావరకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టేస్తున్నారు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఒకటేనని భావిస్తున్నారు. దాంతో పిల్లల పెంపకం తీరులో కూడా మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు ఆడపిల్లలను ఏదో ఒక డిగ్రీ చదివించి, పెళ్లిచేసి పంపేస్తే సరిపోతుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. అమ్మాయిలైనా బాగా చదువుకుని, కొన్నాళ్లు ఉద్యోగం చేసి, తమ కాళ్ల మీద నిలబడగలిగిన తర్వాతే పెళ్లి అంటున్నారు. ఈ ఆలోచన మరికొంత ముందుకు వెళ్లింది. విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటే తమ భవిష్యత్తు బాగుంటుందని, మంచి ఉద్యోగంలో స్థిరపడగలిగితే అమ్మానాన్నలను తాను బాగా చూసుకోగలనని అమ్మాయిలు చెబుతున్నారు. అందుకే గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్లేవారిలో అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతోంది. బాగా చదువుకున్న తల్లిదండ్రులు ఉన్న కుటుంబాల నుంచి అమ్మాయిలను విదేశాలకు పంపడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. మధ్య, ఎగువ మధ్యతరగతి కుటుంబాలైనా సరే, బ్యాంకులు రుణాలు ఇస్తుండటంతో విదేశీవిద్యకు పంపుతున్నారు. సహజంగానే అమ్మాయిలు చదువు మీద కాస్త ఎక్కువ దృష్టి పెడుతుండటంతో వాళ్లకు ఇంజినీరింగ్ లాంటి గ్రాడ్యుయేషన్ స్థాయి విద్యలో 8-8.5 సీజీపీఏ వస్తోంది. దానికితోడు టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్‌టీఎస్ లాంటి ప్రవేశ పరీక్షలలోనూ మంచి స్కోరు సాధిస్తున్నారు. దాంతో వాళ్లకు అగ్రశ్రేణి యూనివర్సిటీలలో ప్రవేశాలు సులభంగా దొరుకుతున్నాయి. యూనివర్సిటీ మంచిదైతే, 100-150 ర్యాంకులలోపు ఉంటే బ్యాంకుల నుంచి విద్యారుణాలు రావడం చాలా సులభం. మన సమాజంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తుండటం మంచి పరిణామం.
కొవిడ్ తర్వాత పెనుమార్పు
అమెరికాలో అధ్యక్షులు ఎవరున్నారు, వారి విధానాలేంటి అన్నదాన్ని బట్టి భారతీయులు అక్కడికి వెళ్లడం ఆధారపడుతుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఫస్ట్ అనే విధానం అవలంబించడంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు వెనుకాడారు. ఆ తర్వాత కొన్నాళ్లు కొవిడ్ మహమ్మారి విజృంభించింది. దాంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. 2021 ప్రారంభంలో జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత నుంచి మళ్లీ విదేశీ విద్యార్థుల చూపు అమెరికా మీద పడింది. పైగా, కొవిడ్ రావడానికి ప్రధాన కారణం చైనా కావడంతో, అక్కడి నుంచి అమెరికా, ఇతర దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య బాగా పడిపోయింది. ఒకవేళ వెళ్లినా అక్కడ తమను ఎలా చూస్తారోనన్న ఆలోచనతో చైనీయులు విదేశాల్లో చదవడం తగ్గించారు. ఇది ఒక రకంగా భారతీయ విద్యార్థులకు బాగా కలిసొచ్చింది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధికంగా భారతదేశం నుంచి 82,500కుపైగా విద్యార్థి వీసాలను అమెరికన్ రాయబార కార్యాలయాలు జారీచేశాయి. వీటిలో సింహభాగం అమ్మాయిలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని ఆయన వివరించారు.