మీకు అర్థమవుతోందా…!

కోల్‌సిటీ(రామగుండం) : మీకు..అర్థమవుతోందా..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. నో స్మోకింగ్‌ ప్లీజ్‌ అని సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తున్నా ధూమపానం మానడం లేదు జనం. తెరపై చూసిన పొగ రాయుళ్లు సినిమా మధ్యలోనే సిగరేట్‌ పొగను పీల్చేస్తున్నారు. తెరపై మీరేసుకున్నది మీరేసుకుంటే.. మేం తాగాలనుకున్నది తాగేస్తామంటూ గుప్పు గుప్పుమంటూ పొగలాగేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది.

ప్రాణాలు తీసే పొగ…
ఫ్రెండ్స్‌తో..కాలేజీ రోజుల్లో ప్రారంభమయ్యే సిగరేట్‌ తాగే అలవాటుకి బీజం పడుతోంది. ఇలా సరదాగా మొదలై..హృదయానికి “పొగ’బెడుతోంది. మొదట్లో సరదాగానే ఉన్నా తర్వాత పొగకు అడిక్ట్‌ అయిపోతున్నారు. ఒక్కరోజు సిగరేట్‌ తాగకుంటే ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా, చిరాగ్గా ఉంటోందని చెబుతున్నారు. కొందరైతే రోజుకు ఒక సిగరేట్‌తో మొదలు పెట్టి..క్రమంగా రోజుకో పెట్టె వరకూ పీల్చేస్తుంటారు.

ప్రకటనలు ఇస్తున్నా.. అంతే
ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రకటనలు ఇస్తున్నా..ఇదొక వినోదంలా మారిపోయింది. ధూమపానం లేని లోకాన్ని చూడగలమా..? అనే సందేహం కలుగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎంత నిషేధం విధించినప్పటికీ పొగరాయుళ్లు దర్జాగా సిగరేట్‌ కాల్చుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్దీ ప్రజలు పొగతాగడం ద్వారా మృత్యువాతకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.