కోడిని తింటే ‘కోవిడ్‌’ రాదు..

అమరావతి బ్యూరో: కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్‌) వైరస్‌ రాదని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది. కరోనా వైరస్‌ ప్రచారంతో ఆందోళన చెందిన మాంసంప్రియులు చికెన్‌ తినడం భారీగా తగ్గించేశారు. దీంతో ధరలు పాతాళానికి పడిపోయి కోళ్ల పరిశ్రమ కకావికలమైపోతోంది. ఈ పరిశ్రమ యజమానులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో పశుసంవర్ధక శాఖ స్పందించింది..

 కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల కరోనా వైరస్‌ సోకదన్న విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిందని.. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ శాఖ సిబ్బందికి ఆదేశాలిచ్చింది.
– పౌల్ట్రీ ఫెడరేషన్ల సహకారంతో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్‌ డైరెక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించింది.
– పుకార్ల కారణంగా కోళ్ల సంఖ్య తగ్గిపోయి భవిష్యత్తులో చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
– కోళ్ల దాణాలో వాడే ముడి సరకులైన మొక్కజొన్న, సోయాల ధరలు దెబ్బతిని రైతులూ నష్టపోయే అవకాశం ఉంది.