తేలు విషంతో కీళ్ల నొప్పుల నివారణ?
వినేందుకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ.. తేళ్ల విషయంలోని పదార్థాలతో ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని గుర్తించారు ఫ్రెడ్ హుచిట్సన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో తేలు విషంలోని ఓ బుల్లి ప్రొటీన్ కీళ్ల తాలూకు మంట/వాపు లను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారి మంట/వాపులను తగ్గించేందుకు ఇప్పటికే కొన్ని మందులు ఉన్నప్పటికీ వాటితో దుష్ప్రభావాలు ఎక్కువ. స్టెరాయిడ్లను వాడటం వల్ల శరీరం మొత్తం సమస్యలకు లోనవుతుంది. ఫలితంగా రక్తపోటు పెరిగే, బరువు పెరిగే అవకాశాలూ ఎక్కువ. ఒకటికంటే ఎక్కువ కీళ్లలో నొప్పులు ఉన్నవారికి ఈ దుష్ప్రభావాలను తట్టుకోవడం కష్టమవుతుందని, ఈ సమస్యను అధిగమించేందుకు తాము చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నామని డాక్టర్ జిమ్ ఓల్సన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.
నాలుగేళ్ల క్రితం తాము దుష్ప్రభావాలు లేని మందు కోసం తేలు, సాలీడు విషాల్లోని సుమారు పెప్‌టైడ్లను పరిశీలించినప్పుడు ఒక పెప్‌టైడ్ కార్టిలేజ్‌లోనే సహజంగా పెరుగుతున్నట్లు గుర్తించామని ఓల్సన్ తెలిపారు. ఈ పెప్‌టైడ్‌తో మెరుగైన చికిత్స కల్పించవచ్చునని గుర్తించి ఎలుకలపై ప్రయోగాలు చేపట్టామని, ఆపెప్‌టైడ్ ఆర్థరైటిస్ లక్షణాలను విజయవంతంగా నయం చేసిందని వివరించారు. అయితే ఈ ప్రొటీన్ ఆధారంగా కొత్త మందులు తయారు చేసేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు.