ఇంటర్‌ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ బీటెక్‌ విద్యార్థి

అమీర్‌పేట: ఇంటర్‌ విద్యార్థికి బదులు పరీక్ష రాస్తూ్త బీటెక్‌ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఆర్‌నగర్‌లోని నారాయణ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థి అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని దీప్‌శికా ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలోని ఇంటర్‌ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే విద్యార్థికి బదులుగా బీటెక్‌ చదువుతున్న సాయితేజ అనే మరో విద్యార్థి శుక్రవారం జరిగిన గణితం బి.2 పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్న విద్యార్థి వయస్సు ఎక్కువగా కనిపించడంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి హాల్‌ టికెట్‌ను తనిఖీ చేశాడు.విద్యార్థి వద్ద ఉన్న హాల్‌టికెట్‌లోని ఫోటోతో పరీక్ష రాస్తున్న విద్యార్థిని పరిశీలించడంతో అసలు విషయం వెలుగుచూసింది.దీంతో పరీక్షా కేంద్ర చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సాయినాథ్‌ తెలిపారు.