కేటీఆర్‌, క‌విత‌ల కోసం ఇంత మందిని బ‌లి చేస్తారా ?

రాజు త‌లుచుకుంటే కొర‌డ దెబ్బ‌ల‌కు కొదువ అన్న‌ట్లు ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు. స్వ‌రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాల కుక్క‌లా ఉంటాను అని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మంత్రి ప‌ద‌వుల విష‌యంలో త‌న కుటుంబానికే పెద్ద‌పీట వేస్తున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ కుటుంబం నుండి సీఎంగా కేసీఆర్‌, మంత్రులుగా త‌న‌యుడు కేటీఆర్‌, అల్లుడు హారీష్‌రావు, ఎంపీగా సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీగా క‌వితల‌కు ప‌దువులు క‌ట్ట‌బెట్టారు. అయితే ఇప్పుడు కేటీఆర్‌ని ముఖ్య‌మంత్రిగా, క‌విత‌ను మంత్రిగా చేయ‌డం సీఎం ముందు ఉన్న పెద్ద స‌వాలు. గత కొన్ని రోజుల క్రితం కేటీఆర్ సీఎం అవుతున్నార‌ని సాటి మంత్రులు ఆకాశానికి ఎత్తుకున్నారు. ఆ స‌మ‌యంలో రాజ‌కీయ వ‌ర్గాల నుండి, పార్టీ కార్య‌క‌ర్త‌ల నుండి పెద్ద ఎత్తున్న వ్య‌తిరేక‌త రావ‌డంతో దానికి అక్క‌డే పులిస్టాప్ పెట్టేశారు.

ఇటీవ‌ల మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో మ‌రోమారు కేటీఆర్‌, క‌విత‌ల ప‌దువులు విష‌యంలో మ‌ళ్లీ టాప్ స్పీడ్‌లోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా సొంత‌పార్టీలో ఉంటూ పార్టీని విమ‌ర్శించిన ఈటల‌ను మంత్రివ‌ర్గం నుండి త‌ప్పించారు. అయితే ఆ ప‌ద‌విని వెంట‌నే క‌విత‌కు క‌ట్టబెడితే రాజ‌కీయంగా చాలా ఇబ్బందులు వ‌స్తాయ‌ని ఆలోచించిన కేసీఆర్ మ‌రో ఇద్దరికి కూడా ఉద్వాస‌న ప‌ల‌కాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈటల త‌ర్వాత భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, మ‌ల్లారెడ్డిల‌ను మంత్రివ‌ర్గం నుండి త‌ప్పించి ఇటు క‌విత‌ను మంత్రిని చేసి, త‌ను ఉన్న‌ప్పుడే కొడుకును సీఎంగా చూడాల‌ని క‌ల నేర‌వేర్చుకునేలా కేటీఆర్ సీఎంగా చేస్తార‌ని సొంత పార్టీ నేత‌లే బాహాటంగా చ‌ర్చించుకుంటున్నారు. కానీ వీరిద్ద‌రి ప‌ద‌వుల కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన ఈటల లాంటి మ‌నుషుల‌ను బ‌లి చేయ‌డం కేసీఆర్ చేసిన పెద్ద త‌ప్పే గుస‌గుస‌లాడుతున్నారు తెరాస శ్రేణులు.