ఈటెల తరువాత నెక్స్ట్ వీరే

మాజీ మంత్రి ఈటల వ్యవహారంలో ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తోంది. ఇప్పటి వరకు ఈటలను టార్గెట్​ చేసిన గులాబీ బాస్​… ఇప్పుడు ఆయన కోటరీపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఎలాంటి హడావుడి లేకున్నా… ఆరోపణలు రాకున్నా.. ఈటలకు సహాకరించే వేర్లను నరుకుతున్నారు. అటు భూముల వ్యవహారంలో విచారణ కమిటీ వేసిన ప్రభుత్వం విచారణ నివేదికపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈటల నియోజకవర్గం నుంచి మొదలు… రాష్ట్రస్థాయిలో ఆయనకున్న బంధాలను కట్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా ఈటల సెగ్మెంట్లో పోలీస్ఆఫీసర్బదిలీ జరిగింది. ఈ పరిణామాల్లో నియోజకవర్గాలు, జిల్లాల్లో టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు చెప్పినవాళ్లే అధికారులుగా ఉంటారనేది కూడా మరోసారి క్లియర్ అయింది.

వెంకట్రామిరెడ్డికి త్వరలోనే చెక్​..?

ఈటల రాజేందర్​ వియ్యంకుడు, హార్టికల్చర్, సెరికల్చర్​డైరెక్టర్​వెంకట్రామిరెడ్డికి కూడా త్వరలో ప్రభుత్వ విధుల నుంచి ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయన పదవీ విరమణ చేసినా దాదాపు రెండున్నరేండ్లుగా ఎక్స్​టెన్షన్​పై పని చేస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఉద్యానవన, పట్టుపరిశ్రమ విభాగాల బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు వెంకట్రామిరెడ్డి కూడా అంతా తానై వ్యవహరించారు. ప్రస్తుతం ఈటల వ్యవహారంలో ప్రభుత్వం ఒక్కొక్కటిగా తెంపుతుండగా… త్వరలోనే ఈయనను కూడా పంపించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాల్లో టాక్.

ఉద్యానవన డైరెక్టర్​పోస్ట్​ కోసం చాలా మంది ప్రయత్నాలు చేసినా… రిటైర్డ్​ ఆఫీసర్​నే చాలాకాలంగా కూర్చుండబెట్టుతున్నారు. మంత్రివర్గంలో ఉన్న ఈటల సహకారంతో ఆయన కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు మంత్రివర్గం నుంచి ఈటలను బయటకు పంపడంతో వెంకట్రామిరెడ్డిని కూడా అతి త్వరలోనే ఇంటికి పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన్ను కూడా ఉన్నఫళంగా పంపిస్తారా… లేకుంటే ఈ శాఖలో కూడా ఏమైనా అవినీతి, ఆరోపణలపై వేటేస్తారా అనేదే తేలాల్సి ఉంది.

అటు ఉద్యానవన శాఖలో కూడా పలు ఆరోపణలు ఏండ్ల నుంచే ఉంటున్నాయి. ఇప్పుడు వేటిని మెడకు చుడుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు, ఎంక్వయిరీలు వంటివి రాకుండా ముందుగానే రాజీనామా చేయాలని కూడా భావిస్తున్నట్లు ఆ శాఖలో చర్చించుకుంటున్నారు.

వేట మొదలైంది..

మరోవైపు ఈటల కోటరీలోని కొంతమంది అధికారులపై వేటు మొదలైంది. దీనిలో భాగంగా పోలీస్​ ఆఫీసర్లను ముందుగా టార్గెట్​ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పితేనే పోలీసులకు ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్​లు ఇస్తున్నారనేది బహిరంగమే. ఇప్పటి వరకు హుజురాబాద్​ ఏసీపీగా ఉన్న ఎస్.శ్రీనివాస్​రావును డీజీపీకి రిపోర్టు చేయాలని బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈటలకు ఇప్పటి వరకు అండగా ఉన్న అధికారులపై కూడా త్వరలోనే వేటు పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఏడుగురిపై ఎందుకో..?

ఈటల కోటరీ వ్యవహారంలో హుజురాబాద్​ ఏసీపీని బదిలీ చేయగా… మొత్తం ఏడుగురిని బదిలీ చేశారు. ఈ బదిలీల్లో పెద్దపల్లి ఏసీపీని కూడా బదిలీ చేయడం చర్చగా మారింది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ నేత… ఈటలతో సఖ్యతగా ఉంటున్నాడని, ఆయనతో ఫోన్​లో టచ్​లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల జరిగిన న్యాయవాదుల హత్య కేసులో కూడా సదరు నేత పేరు చర్చకెక్కడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఏసీపీని మార్చడం, ఆ స్థానంలో మరొకరిని వేయడంపై పలు ప్రచారం జరుగుతోంది.

కొత్తగూడెం ఎస్​డీపీఓగా హైదరాబాద్​ ఎస్ఐబీ డీఎస్పీ వెంకటేశ్వరబాబును నియమించారు.
దీనితో పాటుగా నిజామాబాద్​ టౌన్​ ఏసీపీగా వెయిటింగ్​లో ఉన్న వెంకటేశ్వర్లు, హుజురాబాద్​ ఏసీపీ శ్రీనివాసరావును డీజీపీ కార్యాలయానికి, సీఐడీ డీఎస్పీ కోట్ల వెంకట్​రెడ్డిని హుజురాబాద్​ ఏసీపీగా, కరీంనగర్​ ట్రాఫిక్​ఏసీపీ సోమనాథంను కామారెడ్డి టౌన్​కు, అక్కడ లక్ష్మీనారాయణను నిజామాబాద్​ సీసీఎస్​కు, సికింద్రాబాద్​డీఎస్పీ సారంగపాణిని పెద్దపల్లి ఏసీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కొంతమంది ఉద్యోగ నేతలకు కూడా..?

ఈటల వ్యవహారంలో ఎవరెవరికి సత్సంబంధాలు ఉన్నాయనే సమాచారాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలోని ఒక వర్గం దగ్గర పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటలతో ఏ ఏ అధికారికి సంబంధం ఉంది, పోస్టింగ్​ల్లో కల్పించుకున్నారా, ఉద్యోగ సంఘాల నేతలతో ఎలా ఉంది, ఇప్పుడు వారి మధ్య ఏమైనా టాక్స్​ జరుగుతున్నాయా అనే కోణాల్లో పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈటల వ్యవహారం అధికారులకు కూడా చుట్టుకునే అవకాశాలున్నాయి.