కృత్రిమ ఎముక‌తో వృద్ధుడికి కొత్త జీవితం

  • కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రిలో అమ‌ర్చిన వైద్యులు
  • ఒడిశా మారుమూల ప్రాంతంలో రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వృద్ధుడు
  • హైద‌రాబాద్ మిధానిలో కృత్రిమ ఎముక త‌యారీ..విశాఖ‌లో అమ‌రిక

    డెక్క‌న్ న్యూస్‌, ఏపీ హెల్త్ బ్యూరో: ఒడిశాలోని మారుమూల ప్రాంతంలో రోడ్డుప్ర‌మాదానికి గురై, ఎడ‌మ కాలి ఎముక‌ను దాదాపుగా కోల్పోయిన ఓ వృద్ధుడికి విశాఖ‌ప‌ట్నం కిమ్స్ ఆసుప‌త్రిలో క్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేశారు. కృత్రిమ ఎముక‌ను అమ‌ర్చి అత‌డికి కొత్త జీవితం ప్ర‌సాదించారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను విశాఖ‌ప‌ట్నం కిమ్స్ ఆసుప‌త్రి ఎండీ, చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ డాక్ట‌ర్ స‌తీష్ కుమార్ పెత‌కం శెట్టి, మ‌రో ఆర్థోపెడిక్ వైద్య‌నిపుణుడు డాక్ట‌ర్ సిదార్థ‌ మీడియాకు తెలిపారు.

“50 ఏళ్ల వృద్ధుడికి ఒడిశాలోని మారుమూల ప్రాంతంలో ప్ర‌మాదం జ‌రిగింది. అత‌డు బాగా నిరుపేద కుటుంబానికి చెందిన‌వారు. అక్క‌డ ఆరోగ్య స‌దుపాయాలు కూడా ఏమీ లేవు. ప్ర‌మాదంలో ఎడ‌మ కాలి ఎముక బాగా దెబ్బ‌తిని, ఎముక ముక్క‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. అక్క‌డి నుంచి విశాఖ‌ప‌ట్నం రావాలంటే దాదాపు రెండు రోజులు ప‌డుతుంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఆసుప‌త్రికి వ‌చ్చేస‌రికి 40 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింది. తీవ్రంగా ర‌క్త‌స్రావం కావ‌డంతో పాటు.. గాయానికి ఎలాంటి క‌ట్లు స‌రిగా లేక‌పోవ‌డంతో లోప‌ల‌కు మ‌ట్టి వెళ్లిపోయి బాగా పాడైంది. సాధార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగిన 24 గంట‌ల్లోగా ఆసుప‌త్రికి వ‌స్తే ప్లేటు వేసి ఎముక‌ను కాపాడుకునే అవ‌కాశం ఉంటుంది. అయినా ముందుగా రోగి రాగానే గాయాన్ని మొత్తం శుభ్రం చేసి, ప్లేటు అమ‌ర్చ‌డంతో పాటు అటూ ఇటూ వైర్లు కూడా వేసి ఆప‌రేష‌న్ చేశారు. ఊడిపోయిన ఎముకను తీసేయాల్సి వ‌చ్చింది. ఇలా దాదాపు 8 సెంటీమీట‌ర్ల‌కు పైగా ఎముక పాడైపోయింది. సాధార‌ణంగా 6 సెంటీమీట‌ర్ల లోపు అయితేనే మ‌ళ్లీ ఎముక‌ను పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ఉంటుంది. 50 ఏళ్ల‌కు పైగా వ‌య‌సు ఉండ‌టం, ఎముక పాడైపోవ‌డంతోపాటు చుట్టూ మ‌ట్టిచేర‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు సోకే ప్ర‌మాదం ఉంది. అందుకోసం ముందుగా ఆ ప్రాంత‌మంతా శుభ్రం చేసి, రాడ్లు వేసి ఆప‌రేష‌న్ చేశారు. ఎముక బాగా ఎక్కువ భాగం దెబ్బ‌తిన‌డం వ‌ల్ల మ‌ళ్లీ ఎముక వేయ‌డానికి వీల్లేని ప‌రిస్థితి.
ఇన్ఫెక్ష‌న్ త‌గ్గిన త‌ర్వాత ఎముక మ‌ళ్లీ ఎద‌గాలంటే ఏడాది, ఏడాదిన్న‌ర పాటు మంచానికే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. త్వ‌ర‌గా న‌డ‌వడానికి వీలుగా కృత్రిమ ఎముక‌ను కావ‌ల్సిన ప‌రిమాణంలో త‌యారు చేయించి, దాన్ని అమ‌ర్చాల‌ని నిర్ణ‌యించాం. సీటీ స్కాన్ ద్వారా మొత్తం కొల‌త‌ల‌న్నీ తీసుకుని హైద‌రాబాద్ న‌గ‌రంలోని మిధాని (మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెడ్‌) లో టైటానియంతో ఈ కృత్రిమ ఎముక‌ను త‌యారుచేయించాం. ఇది త‌యార‌వ‌డానికి రెండు వారాల‌కుపైగా ప‌డుతుంది. ఈ లోపు ఇన్ఫెక్ష‌న్ త‌గ్గ‌డానికి స‌మ‌యం ఉంది కాబ‌ట్టి, మొత్తం ఆరు వారాలు ఆగి కృత్రిమ ఎముక‌ను అమ‌ర్చాం. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ సాయంతో కండ‌రాల‌ను కూడా పున‌రుద్ధ‌రించ‌గ‌లిగాం. ఇప్పుడు ఆ రోగి త‌నంత‌ట తానుగా న‌డ‌వ‌గ‌లుగుతున్నారు. ఎముక స‌హ‌జంగా పెర‌గాలంటే దాదాపు రెండేళ్ల వ‌ర‌కు కూడా స‌మ‌యం ప‌డుతుంది, పైగా అది విజ‌య‌వంతం అవుతుందో లేదో తెలియ‌దు. త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి వీలుగా కృత్రిమ ఎముక అమ‌ర్చ‌డంతో ఇప్పుడు త‌నంత‌ట తానుగా అన్ని ప‌నులూ చేసుకోగ‌లుగుతున్నారు. “