పసిపాపకు శ్వాసనాళం.. అన్నవాహికల మధ్యలో ఫిస్టులా
- కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో అత్యంత అరుదైన శస్త్రచికిత్స
- ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ తరహా చికిత్స
డెక్కన్ న్యూస్, ఏపీ హెల్త్ బ్యూరో: శ‌్వాసనాళానికి, అన్నవాహికకు మధ్యలో ఫిస్టులా ఏర్పడిన పసిపాపకు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలను కర్నూలు కిమ్స్ వైద్యులు కాపాడారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఇలాంటి సమస్య వస్తే చాలా ఇబ్బంది తలెత్తుతుంది. ఇలా ఫిస్టులా ఏర్పడటం వల్ల అన్నవాహికకు, పొట్ట భాగానికి సంబంధం లేకపోవడం.. అన్నవాహిక నుంచి నేరుగా ఊపిరితిత్తుల్లోకి పదార్థాలు వెళ్లిపోవడం అనేది ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సమస్యతో పుట్టిన ఒక పాపను కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆదోనిలోని ఒక స్థానిక ఆసుపత్రిలో లోయర్ సెక్షన్ సిజేరియన్ సర్జరీ ద్వారా ఈ పాప జన్మించింది. సాధారణంగా 2500-4000 మంది పిల్లల్లో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుంది. తల్లిదండ్రులు లేదా ముందు తరాల్లో ఎవరికైనా ఉండటం వల్ల ఇది వస్తుంది. ఈ సమస్య ఉన్న పిల్లలకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు తోడు పాపకు తీవ్రంగా డెంగ్యూ జ్వరం ఉండటంతో పాటు సెకండరీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకింది. దాంతోపాటు.. రక్తం గడ్డకట్టి, కాలేయానికి సంబంధించిన ఎంజైముల సమస్య కూడా తలెత్తింది. దాంతో రక్తం ఎక్కించాల్సి వచ్చింది.
ఇన్ని రకాల సమస్యలున్న పసిపాపను కర్నూలు కిమ్స్‌లోని ఎన్ఐసీయూకు తీసుకురాగానే, అక్కడి పిల్లల శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జి. చలపతి పరీక్షించారు. అవసరమైన రక్తపరీక్షలు, రేడియాలజీ పరీక్షలు చేశారు. అత్యవసరంగా థెరకోస్కోపిక్ టీఈఎఫ్ రిపేర్ అనే అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఈ తరహా శస్త్రచికిత్సలను పసి పిల్లలకు చేయడం మరింత కష్టం. ఆంధ్రప్రదేశ్‌లో థెరకోస్కోపిక్ టీఈఎఫ్ రిపేర్ తరహా శస్త్రచికిత్సలు చేసిన మొట్టమొదటి చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ చలపతే కావడం విశేషం. థెరకోస్కోపిక్ టీఈఎఫ్ రిపేర్ ద్వారా శ్వాసనాళానికి, అన్నవాహికకు మధ్య ఉన్న ఫిస్టులాను ఆయన తొలగించారు. పసి పిల్లలకు ఈ తరహా శస్త్రచికిత్సలు చేయడానికి చాలా నైపుణ్యం అవసరం అవుతుంది. దానికితోడు అత్యాధునిక పరికరాలు కూడా ఉండాలి. అవన్నీ కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో ఉండటం, వాటిని ఉపయోగించగల నైపుణ్యం, అనుభవం డాక్టర్ చలపతికి ఉండటంతో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.
ఆ తర్వాత పాపను నియోనాటల్ ఐసీయూకు తరలించారు. ఒక రోజు పాటు ఆమెకు ఇన్వేజివ్ వెంటిలేషన్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మరో ఐదు రోజుల పాటు ఆక్సిజన్ కృత్రిమంగా అందించి, ఆ తర్వాత సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆపరేషన్ జరిగిన నాలుగు రోజుల తర్వాత ముక్కుద్వారా ఆహారాన్ని అందించారు, 10 రోజుల తర్వాత నోటి ద్వారా కూడా అందించారు. ఇవన్నీ పాపకు అరిగాయి. అనుభవజ్ఞులైన పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ జి.భరత్‌రెడ్డి, డాక్టర్ హెచ్.ఎ. నవీద్, డాక్టర్ ఎన్.భారతి తదితరుల సంరక్షణలో పాప పూర్తిస్థాయిలో కోలుకుంది. ఇప్పుడు పాపకు తల్లిపాలు కూడా పడుతున్నారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కంటికి రెప్పలా కాపాడుకోవడం వల్లనే పాప పూర్తిగా కోలుకుని, సాధారణ పరిస్థితికి చేరుకుంది.