మూడు రకాల శస్త్రచికిత్సలతో రైతు కాలును కాపాడిన కిమ్స్ వైద్యులు
సంగారెడ్డి జిల్లా మదనపల్లి సమీపంలో 47 ఏళ్ల వయసున్న ఒక రైతు తన ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తుండగా ఎదురుగా మరో వాహనం వచ్చింది. దాన్ని తప్పించేందుకు పక్కకు తిరుగుతూ అక్కడున్న పిల్లర్‌ను గట్టిగా ఢీకొన్నారు. దాంతో ఆయన కాలికి పలు రకాల గాయాలయ్యాయి. వెంటనే
వేరే ఆస్పత్రికి తీసుకెళ్లగా కాలు తీసేయాల్సి ఉంటుంది అని చెప్పారు. దాంతో ఆయన బంధువులు ప్రాథమిక చికిత్స మాత్రం చేయించి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కుడికాలు పాదానికి తగిలిన దెబ్బవల్ల రక్తస్రావం అవుతున్న స్థితిలో, తీవ్రమైన నొప్పితో అతడు కిమ్స్ ఆసుపత్రికి వచ్చాడు. కుడికాలి ఎముక విరగడం, కాలి రక్తనాళాలు దెబ్బతినడం, పాదం పూర్తిగా నలిగిపోయి కండరాలు దెబ్బతినడం, పాదంలోని రక్తనాళాలు కూడా నలిగిపోవడం లాంటి సమస్యలను వైద్యులు గుర్తించారు. ఇలా రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు ఎక్కువ ఆలస్యం చేస్తే ఆ భాగానికి రక్తసరఫరా నిలిచిపోయి, అవి శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. అందువల్ల వెంటనే ఎముకల విభాగం, రక్తనాళాల విభాగం, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలకు చెందిన వైద్య నిపుణులంతా తక్షణం సమావేశమై, నిశితంగా చర్చించుకుని అతడి కాలిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. కాలు తిరిగి వస్తుందని రోగికి మనోధైర్యం నింపారు.
తర్వాత ముందుగా ఆర్థోపెడిక్, వాస్క్యులర్ సర్జన్లు తమ తమ ఆపరేషన్లు చేశారు. కుడికాలి పాదం నలిగిపోవడంతో దాన్ని అతికించేందుకు కే వైర్‌తో డీబ్రిడ్మెంట్ చేశారు. ఆ తర్వాత మోకాలిని, చీలమండను అతికించేందుకు బయటివైపు నుంచి ఒక ఫ్రేమ్ అమర్చి చికిత్స చేశారు. ఆ తర్వాత పాప్లిటియల్ థ్రాంబెక్టమీ, ఫాస్కియోటమీ చేయాల్సి వచ్చింది. ఇందుకోసం అతడికి జనరల్ అనస్థీషియా ఇచ్చారు. కాలి బయటివైపు ఒక ఫ్రేమ్ అమర్చి గాయాన్ని నయం చేశారు. దాంతోపాటు పాదంలోను, కాలికి ఉన్న రక్తనాళాలను సరిచేశారు. నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరిశీలించగా, రక్తనాళాలు బాగా పనిచేసి, రక్తసరఫరా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇలా జరగకపోయి ఉంటే, తప్పనిసరిగా కాలు తొలగించాల్సి వచ్చేది. పైగా ప్లాస్టిక్ సర్జరీకి కూడా వీలు పడదు. కానీ కిమ్స్ ఆసుపత్రిలోని వైద్యనిపుణులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను నైపుణ్యంతో చేయడం వల్ల పాదాన్ని కూడా సరిచేసేందుకు వీలుపడింది. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు తొడభాగం నుంచి కొంత కండరాన్ని తీసుకుని, దాన్ని పాదానికి అమర్చారు. ఈ రెండు శస్త్రచికిత్సలకు మధ్య దాదాపు వారానికి పైగా తేడా ఉంది. ప్లాస్టిక్ సర్జరీ అయిన మూడు వారాల తర్వాత బయట అమర్చిన ఫ్రేమును తొలగించారు. ఆ తర్వాత రోగి ఫిజియోథెరపీ చేయించుకుని వాకర్ సహాయంతో నడవడం మొదలుపెట్టారు.