అందరికీ కుంభ్ సందేశ్ చేరువ కావాలి
కుంభ్ సందేశ్ యాత్రలో పాల్గొననున్న వివిధ సంస్థలు
జీకాట్ రౌండ్ టేబుల్ సమావేశంలో జేడీ, సత్యవాణి, కప్పర, గంపా నాగే శ్వరరావు హామీ ఇటీవల గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించిన జీ కాట్ సంస్థ( గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ) మరో బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కుంభమేళాకు వచ్చే పలువురు సాధుసంతులు చెప్పే విషయాలను భారతీయులందరికీ తెలియజేసే ఉద్దేశంతో కుంభసందేశ్ పేరుతో కుంభమేళాకు ఒక యాత్ర నిర్వహించాలని జీకాట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కుంభసందేశ్ యాత్ర గురించి చర్చించేందుకు భిన్న వర్గాలకు చెందిన ప్రతినిధులతో హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవార రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జీకాట్ వ్యవస్థాపకుడు ఢిల్లీ వసంత్ సమావేశం ప్రారంభ ఉపన్యాసం చేయగా సమావేశానికి అధ్యక్షతగా యాత్ర కో ఆర్డినేటర్ మంకెన శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు. సమావేశంలో పాల్గొన్న వక్తలు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థలను కుంభ్ సందేశ్ యాత్రలో భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కుంభ్ సందేశ్-కరోనా అనంతరం ప్రపంచానికి ఆవశ్యకత
అను అంశంపై విస్తృతంగా చర్చించారు.
సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో జనజీవన వాహిని ప్రశాంతంగా సుందరంగా పయనించాలంటే దానికి ఉదాత్తమైన, గంభీరమైన సంస్కృతి ఒక ఒరవడి కావాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంస్థ తరఫున సహాయ సహకారాలు కుంభ్ సందేశ్కు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. జూమ్ యాప్ ద్వారా అందరికీ కుంభ్ సందేశ్ చేరువ కావాలని జేడీ సూచించారు. అనంతరం వక్త సంపాదకురాలు, ప్రచురణకర్త భారతీయం సత్యవాణి మాట్లాడుతూ మరుగున పడుతున్న భారతీయ వైజ్ఞానిక ప్రతిభ వెలుగులోకి రావడానికి కుంభ్ సందేశ్ ప్రధాన వేదిక కావాలని ఆమె అన్నారు. యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారిని నిలువరించి ప్రాణ నష్టం తగ్గించడంలో భారతీయ వైద్యవిధానం, ఆహారనియమాలు శ్రీరామ రక్షగా నిలిచాయన్నారు. దీంతో ప్రపంచదేశాలన్ని భారతీయ సంస్కృతిని, గొప్పదనాన్ని కొనియాడాయన్నారు. భారత దేశం ప్రపంచానికి దేవాలయం వంటిదని ఆమె ఈ సంద్భంగా కొనియాడారు. యోగా డే మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వేదాలకు ఒక డేను కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. సామాన్యుల గుండె చప్పుడే కుంభ్ సందేశ్ అని ఈ సందర్భంగా వక్తలు నినదించారు. రవీంద్ర శర్మ ఆదర్శంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జీకాట్ వ్యవస్థాపకుడు ఢిల్లీ వసంత్ ఈ సందర్భంగా తెలిపారు. సందేశ్ యాత్ర కన్వీనర్‌గా సామాజిక వేత్త కొరివి వినయ్‌కుమార్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు వారు ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ సమావేశంలో పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రతినిధి గంపా నాగేశ్వరరావు, నారాయణ జిజ్ఞాస, నాగరత్నం నాయుడు, జీకాట్ నిర్వాహకులు రాంరెడ్డి, శ్రవణ్‌కుమార్, కామేశ్వరరాజు, డా. పాశం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.