కిమ్స్ లో అరుదైన చికిత్స…ఒక రోజు వయసున్న పాప ప్రాణాలు కాపాడిన ఎక్మో
డెక్కన్ న్యూస్: గర్భంలో ఉన్న పిల్లలు సాధారణంగా మల విసర్జన చేయరు. కానీ అత్యంత అరుదుగా కొన్నిసార్లు చేస్తారు, తర్వాత మళ్లీ అది ఉమ్మనీరులో కలిసి వాళ్ల ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్తుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి, చాలా అత్యాధునికమైన, సంక్లిష్టమైన వైద్యచికిత్సలు చేయాల్సి వస్తుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన స్రవంతి అనే గర్భిణికి ఇలాంటి సమస్య వల్లే అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది.
కిమ్స్ ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ వి. నందకిషోర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘పాప పుట్టినప్పుడు బాగానే ఉన్నా, కొద్దిసేపటికే ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టంగా మారింది. దాంతో పాపను వెంటనే ఐసీయూకు తరలించి, వెంటిలేటర్ అమర్చి దానిద్వారా గాలి అందించాము. గర్భంలో ఉండగా మలవిసర్జన చేయడంతో పాటు ఊపిరితిత్తుల్లో పాపకు రక్తపోటు బాగా ఎక్కువైంది (పల్మనరీ హైపర్‌టెన్షన్). దాంతో ప్రత్యేకమైన ఔషధం, గ్యాస్ (ఇన్‌హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్) కూడా అందించి ఊపిరితిత్తుల్లో రక్తపోటు తగ్గించాల్సి వచ్చింది. ఇంత చికిత్స చేసినా పాప పరిస్థితి మరింత విషమంగా మారుతూ వచ్చింది. దాంతో పాపను కిమ్స్ ఆసుపత్రికి తరలించి.. అక్కడ ఎక్మో ఆధారంగా చికిత్స చేశాము.
పాపను వెంటనే ఎక్మో మీద పెట్టి, సాధారణ స్థితికి తెచ్చాం. పిల్లల గుండెవైద్య నిపుణులు చిన్న ఆపరేషన్ చేసి ఈ చికిత్స చేశారు. పాపకు 5రోజుల పాటు ఎక్మో సపోర్ట్ అవసరమైంది, తర్వాత మరో 5 రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంది. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో పాపను డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపారు. ఇప్పుడు తల్లిపాలు కూడా తాగగలుగుతోంది’’ అని డాక్టర్ నందకిషోర్ తెలిపారు.
‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తులు చేయాల్సిన పనిని ఎక్మో చేస్తుంది. (ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడిచిపెట్టడం). తద్వారా ఊపిరితిత్తులు కోలుకోడానికి సమయం, విశ్రాంతి దొరుకుతాయి. ఎక్మో సర్క్యూట్‌లో ఉండే కృత్రిమ ఊపిరితిత్తులకు (ఆక్సిజనేటర్) రక్తప్రసారాన్ని మళ్లిస్తారు. సాధారణంగా గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దారునంగా దెబ్బతిని, సంప్రదాయ చికిత్సా పద్ధతులతో నయం కాని పరిస్థితుల్లో ఎక్మోను ఉపయోగిస్తారు. ఇది అన్ని వయసుల వారికీ చేస్తారు, ముఖ్యంగా హెచ్1ఎన్1 మరియు కొవిడ్-19 కాలంలో ఇది అందరికీ తెలిసింది.
పాశ్చాత్య దేశాల్లో దాదాపు 40 ఏళ్లుగా ఎక్మో అందుబాటులో ఉంది, భారతదేశంలో పదేళ్ల క్రితం వచ్చింది. అయినా అవసరమైనంత మేర దాన్ని వాడట్లేదు. ఆరోగ్యరంగ నిపుణుల్లో తగినంత అవగాహన లేకపోవడమే అందుకు కారణం. జంటనగరాల్లో అవగాహన పెంచేందుకు చేసిన ప్రయత్నాల వల్లే పాపను సరైన సమయానికి తీసుకొచ్చారు’’ అని ఆయన వివరించారు.
అప్పుడే పుట్టిన పిల్లలకు ఎక్మోచికిత్స చేయడం కిమ్స్ ఆసుపత్రిలో ఇది రెండోసారి. తెలుగు రాష్ట్రాల్లో పసి పిల్లలకు ఎక్మో చికిత్స చేసిన ఏకైక ఆసుపత్రి కిమ్స్. 2012 నుంచి ఇక్కడ ఎక్మో సేవలు ప్రారంభమయ్యాయి.