కొవిడ్ సమయంలో కాలేయమార్పిడి అవసరమైన రోగుల్లో సగం మంది మరణం!
- లక్డీకాపుల్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యబృందం పరిశీలన
- కరోనా వైరస్ సోకుతుందన్న భయంతో ఆలస్యం చేయడమే మరణాలకు కారణం
- మేలో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత 30 మందికి కాలేయమార్పిడి శస్త్రచికిత్సలు
లక్డీకాపుల్‌లోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యబృందం చేసిన పరిశీలన ప్రకారం, కాలేయమార్పిడి వెంటనే అవసరమైన రోగుల్లో సగం మంది కొవిడ్ సమయంలో అది చేయించుకోకపోవడం వల్ల మరణించారు. ఆసుపత్రికి వస్తే తమకు కొవిడ్ సోకుతుందన్న భయం వల్లే వాళ్లు ఆపరేషన్లు సరైన సమయానికి చేయించుకోలేదు.
కొవిడ్-19 లాక్‌డౌన్ విధించినప్పుడు, ఆ తర్వాతి కాలంలో 48 మంది రోగులకు కాలేయమార్పిడి అత్యవసరంగా చేయాల్సి వచ్చింది. వారిలో 23 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉండి కొవిడ్ సోకకుండా విజయవంతంగా కాలేయమార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. కొవిడ్ సోకిన ఏడుగురు రోగులకు కూడా విజయవంతంగా కాలేయమార్పిడి జరిగింది. 13 మంది రోగులు తమకు వైరస్ సోకుతుందన్న భయం, ఇతర కారణాలతో చికిత్సలు వాయిదా వేసుకుని, ఆ ఆలస్యం వల్ల మరణించారు. మిగిలిన ఐదుగురు శస్త్రచికిత్సలకు సిద్ధమైనా, వారికి కొవిడ్ సోకి కాలేయమార్పిడి చేయించుకోకముందే మరణించారు! నిజానికి వారి మరణానికి ప్రధాన కారణం కాలేయమార్పిడి సమయానికి జరగకపోవడమే తప్ప కేవలం కొవిడ్ మాత్రమే కాదు.
అవయవమార్పిడి శస్త్రచికిత్సల విషయంలో అత్యవసరాన్ని గురించి గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి క్లినికల్ హెడ్ మరియు సీనియర్ కన్సల్టెంట్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాఘవేంద్రబాబు మాట్లాడుతూ “కాలేయం పరిస్థితి విషమించినప్పుడు, మార్పిడి తప్ప రోగికి వేరే మార్గం లేనప్పుడు, శస్త్రచికిత్సకు ఆలస్యం చేస్తే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. కరోనావైరస్ సోకుతుందన్న భయం, ఇతర కారణాలతో కొందరు రోగులు, వాళ్ల కుటుంబసభ్యులు ఈ చికిత్సలను ఆలస్యం చేశారు. ఇలా ఆలస్యం చేయడం వల్ల రోగులు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కాలేయ పరిస్థితి విషమించినప్పుడు మార్పిడి శస్త్రచికిత్సలకు ఆలస్యం చేయడం మంచిది కాదు.”
“గత సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు లక్డీకాపుల్‌లోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో మేము 30 కాలేయమార్పిడి శస్త్రచికిత్సలు చేశాం. అవన్నీ 100% విజయవంతం అయ్యాయి. వీరిలో ఏడుగురు గ్రహీతలు, ముగ్గురు దాతలకు కొవిడ్ పాజిటివ్ ఉంది; మరో రెండు ఘటనల్లో దాతలు, గ్రహీతలు ఇద్దరికీ కొవిడ్ పాజిటివ్ ఉంది. కరోనా వైరస్ సోకి, అది తగ్గిన తర్వాత కాలేయమార్పిడి శస్త్రచికిత్సలు చేయొచ్చన్న విషయం గుర్తించడం ముఖ్యం” అని డాక్టర్ రాఘవేంద్రబాబు వివరించారు.
కొవిడ్ రోగులకు లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. వారిలో కొందరికి శ్వాసపరమైన ఇబ్బందులుంటే మరికొందరికి నాడీ సంబంధ సమస్యలుంటాయి. ఆసుపత్రులలో చేరిన కరోనా రోగుల్లో కొందరికి కాలేయ ఎంజైములు పెరగడం కనిపించింది. అయినా దానికి చికిత్స చేయచ్చు. కాలేయమార్పిడి శస్త్రచికిత్స జరిగిన తర్వాత తక్కువ నుంచి ఒక మాదిరి కరోనా లక్షణాలు వచ్చినా వాళ్లు మాత్రం ఇమ్యునోసప్రెషన్ మందుల వాడకం కొనసాగించవచ్చు. ఈ అంశాలన్నింటి దృష్ట్యా కాలేయమార్పిడి శస్త్రచికిత్సలను వెంటనే చేయించుకోవాలని వైద్యులు చెప్పినప్పుడు రోగులు మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదు.