కుంభసందేశ్‌పై జనవరి 20న రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన జీ-కాట్
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కుంభమేళా ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 27 వరకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈసారి జరుగుతోంది సాధారణంగా ఉత్తరాఖండ్ క్షేత్రంతో పాటు.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ, మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళాకు వచ్చే పలువురు సాధుసంతులు చెప్పే విషయాలను భారతీయులందరికీ తెలియజేసే ఉద్దేశంతో కుంభసందేశ్ పేరుతో కుంభమేళాకు ఒక యాత్ర నిర్వహించాలని గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కుంభసందేశ్ ప్రాధాన్యం గురించి చర్చించేందుకు భిన్న వర్గాలకు చెందిన ప్రతినిధులతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జీకాట్ వ్యవస్థాపకుడు ఢిల్లీ వసంత్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా సంపాదకురాలు, ప్రచురణకర్త భారతీయం సత్యవాణి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాదరావు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రతినిధి గంపా నాగేశ్వరరావు, నిజామాబాద్‌కు చెందిన నారాయణ జిజ్ఞాస, బీజేపీ మాజీ ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని వర్గాల ప్రతినిధులు, విషయాసక్తి కలిగిన ఎవరైనా హాజరు కావచ్చని ఢిల్లీ వసంత్ ఈ సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి జీకాట్ ప్రతినిధులు ఒక పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: శ్రవణ్ మాడప్ – +91 97012 00033
జీకాట్ ప్రయత్నం ఇదీ..
మహాత్మాగాంధీ ఆశయాలను ప్రచారం చేసే ఉద్దేశంతో, ఆయన సూచించిన గ్రామస్వరాజ్య సందేశం సమాజానికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో రూపొందించిన సంస్థే.. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జీకాట్). కుంభసందేశ్ ఆవశ్యకతను చెప్పడానికే చలో కుంభ్‌యాత్రను చేపట్టాలని జీకాట్ నిర్ణయించింది. కుంభమేళా జరిగే నాలుగు ప్రాంతాలైన నాసిక్, ఉజ్జయిన్, ప్రయాగ, హరిద్వార్ వరకు ఇది జరుగుతుంది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనవచ్చని జీకాట్ ప్రతినిధులు తెలిపారు.