బీజేపీలో చేరుతానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే రోజుల్లో తాను బీజేపీలో చేరుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భాజపాలో చేరుతానని గతంలో చెప్పినా… ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో భాజపాకు పెరుగుతున్న ఆదరణ చూసిన కొంత మంది నాయకులు భాజపా తీర్థం పుచ్చకున్నారు. తాజాగా ఆయన నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కొత్త ఏడాదిలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామి వారిని కోరినట్లు ఆయన తెలిపారు. ‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు పీసీసీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. టీపీసీసీ పదవి ఎవరికైనా రావొచ్చు. ఎవరైనా సరే అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. వారు ఎంత వరకు గెలుస్తారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. తెలంగాణ రాజకీయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గతంలో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాను. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందని తొలిసారిగా చెప్పిన వ్యక్తిని నేను. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుందని తెలిసిన తరువాత ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటికీ పాల్గొనలేదు. ప్రజలు తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. ప్రజల క్షేమం కోసం కేసీఆర్ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను. తెలంగాణ అమరవీరులకు ఆత్మశాంతి కలిగేలా కేసీఆర్ ప్రజలందరిని కలుపుకుని పోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే నేను బీజేపీలో చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీనే బలపడాలని స్వామి వారిని కోరాను. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటారు’ అని ఆయన అన్నారు.