గుండెలో రక్తస్రావం అయిన రోగిని కాపాడిన కిమ్స్ ఐకాన్ వైద్యులు
- అత్యంత అరుదైన సూడో అన్యూరిజం సమస్యకు చికిత్స
- తూర్పుగోదావరి రైతుకు విశాఖలో పునర్జన్మ
డెక్కన్ న్యూస్: అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధుడికి తక్షణం కవర్డ్ స్టంట్ వేసి, ఆ వెంటనే బైపాస్ సర్జరీ కూడా చేసి అతడి ప్రాణాలు కాపాడిన ఘటన విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన ఆ వృద్ధుడు.. స్వతహాగా రైతు. ఆయనకు గుండెనొప్పి రావడంతో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వచ్చారు. తొలుత ఆయన దాన్ని సాధారణ గుండెనొప్పిగానే భావించారు. కానీ, కిమ్స్ లోని ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ దామోదరరావు ఆ రోగికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేశాక.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల నుంచి రక్తం కారడాన్ని గుర్తించారు. ఇలా కారే రక్తం గుండె చుట్టూ పేరుకుపోయి, గుండెపై ఒత్తిడి పెంచి.. చివరకు బీపీ తగ్గడం వల్ల రోగి మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. దీన్ని సూడో అన్యూరిజం అంటారు. ఇది ఇంతకుముందు ఆ రోగి వేయించుకున్న స్టంట్‌కు దిగువ ప్రాంతంలో ఏర్పడింది. సాధారణంగా ఒకటి లేదా రెండు పొరలు పగిలిపోయి.. బయటిపొరతో బల్జ్ అవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితిని సరిచేయడానికి ముందుగా కవర్డ్ స్టంట్ వేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేశారు. అయితే, ఒక్కోసారి స్టంట్ మూసుకపోయే అవకాశం ఉన్నందున… వెంటనే బైపాస్ సర్జరీ కూడా చేశారు. గతంలో అతడికి యాంజియోప్లాస్టీ చేసినప్పుడు ఒక వైరు బయటకు వెళ్లిపోయిన విషయం.. సర్జరీ టేబుల్ మీదే తెలిసింది.
సూడో అన్యూరిజం చాలా అరుదైన సమస్య అని, ఇప్పటివరకు తాను ప్రాక్టీసు ప్రారంభించాక కేవలం ఇలాంటివి మూడే కేసులు చూశానని డాక్టర్ దామోదరరావు వివరించారు. బైపాస్ సర్జరీ చేసిన తర్వాత రోగి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యి.. తర్వాత ఫాలోఅప్ కోసం కూడా వచ్చాడన్నారు. భవిష్యత్తులో ధూమపానం, మద్యపానం చేయకుండా జాగ్రత్తపడాలని రోగికి సూచించారు.