చిన్న‌మ్మ విడుద‌ల 27న ?
జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద శ‌ప‌ధం

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు అత్యంత స‌న్నిహితుల‌రాలైన శ‌శిక‌ల అలియాస్ చిన్న‌మ్మ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. అక్ర‌మాస్తుల కేసులో క‌ర్ణాట‌లోని పరప్పన  అగ్రహార చెరలో గ‌త కొన్నాళ్లుగా జైలు జీవితం గ‌డుపుతుంది. అయితే వ‌చ్చే నెల 27న శ‌శిక‌ల విడుద‌ల అవ‌డం ఖాయ‌మ‌ని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అక్రమాస్తుల కేసులో శశికళ శిక్షా కాలం జనవరిలో ముగియనున్న విషయం తెలిసిందే. ఆమె ముందుగానే విడుదల అవుతారన్న ప్రచారం సాగినా, అందుకు తగ్గ పరిస్థితులు కనిపించలేదు. తన ముందస్తు విడుదల విషయంగా శశికళ చేసుకున్న విజ్ఞప్తిని కర్ణాటక జైళ్లశాఖ వర్గాలు పరిశీలనలో ఉంచాయి. ఈ  పరిస్థితుల్లో చిన్నమ్మ ముందుస్తుగాకాదు అని, శిక్షాకాలం ముగియగానే జనవరి 27న విడుదల కావడం తథ్యమని, ఇందులో మార్పు ఉండదని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు తాజాగా ధీమా వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. చిన్నమ్మ రాక గురించి చెన్నైలోని కార్యాలయంలో ఆ కళగం వర్గాలు సమావేశం కావడం, ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. జనవరి 27న చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని, నేరుగా మెరీనా తీరానికి వెళ్లి అమ్మ జయలలిత సమాధి వద్ద శపథం చేయనున్నారని, ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తారని ఆ కళగం నేత ఒకరు పేర్కొన్నారు. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో 65 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లకు నిర్ణయించామని, ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. మరో 28 రోజుల్లో చిన్నమ్మ బయటకు వస్తారని, ఇది జరిగి తీరుతుందని ఆ నేత ధీమా వ్యక్తంచేశారు.