రైతు సంక్షేమం కోసమే బిజెపి:అరుణారెడ్డి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతు సంక్షేమం కోసమేనని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గాడి పల్లి అరుణ రెడ్డి అన్నారు.ఆమె శనివారం సిద్దిపేటలోని వరి కొనుగోలు కేంద్రాలు శివారు వ్యవసాయ భూములను సందర్శించి రైతులతో మాట్లాడారు.కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.సవరించిన చట్టాల మూలంగా రైతులకు నిర్ధారిత ధర పొందే హామీ లభిస్తుందని చెప్పారు.వ్యవసాయ చట్టాలు రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతగానో దోహదపడతాయని అన్నారు.దళారీ వ్యవస్థను రూపుమాపి,రైతులకు పంటను స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు రక్షణ కల్పించడమే ధ్యేయంగా ఈ చట్టాలు రూపొందించడం జరిగిందని వివారించారు. పంటను దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే స్వేచ్ఛను కల్పించడం చట్టాల ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఇన్నాళ్లు పంట ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదని ఇప్పుడు చెమటోడ్చి పండించిన పంటకు ధర నిర్ణయించేది అధికారం రైతులకే దక్కుతుందన్నారు.2022 లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కొరకు, రైతుల శ్రేయస్సు కోసం అనేక రకమైన పథకాలు, సంస్కరణలు,చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం,రైతు రాజు కావడానికి శుభసూచకమని అన్నారు.రైతు సంక్షేమం పట్టని ప్రతిపక్ష పార్టీలు చట్టాలను వ్యతిరేకించడం సిగ్గుచేటు అని అరుణా రెడ్డి విమర్శించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు,యాదన్ రావు,లలిత, విజయ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.