కొనుక్కున్న ప్లాట్లను కాపాడుకునేందుకే ఏకమయ్యాం…హర్ష
పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొన్న సంబరం కూడా ఉండటం లేదు. హైదరాబాద్ సిటీ శివారులో ఇళ్ల స్థలం ఉండాలన్న కోరికతో కొన్న ప్లాట్లలో అక్రమార్కులు కాలు మోపుతున్నారు. నకిలీ పత్రాలతో జాగ మాదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు లెక్కలేన్నన్ని జరుగుతున్నాయి. కొద్దికాలంగా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలో ఉన్న పింక్ ఎస్టేట్స్ వెంచర్ లో కబ్జాదారులు అడ్డదారుల్లో ప్రవేశించి ప్లాట్ల యజమానుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలోని సర్వే నంబర్లు 197, 198, 199, 200, 201, 209, 210, 211, 212, 213, 214 లో ఉన్న 70 ఎకరాల భూమిలో 1995 లో వెంచర్ చేసి 250 నుంచి 300 ప్లాట్లు చేసి విక్రయించారు. మొయినాబాద్ లో రియల్ భూమ్ ఎక్కువగా ఉండటంతో పింక్ ఎస్టేట్స్ వెంచర్ పై కబ్జా కోరుల కన్ను పడింది. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించిన కబ్జాదారులు వెంచర్లో ప్లాట్లు కొనుక్కున్న దాదాపు 300 మందిని బెదింపులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ టీఆరెస్ నాయకుడైన కొంపల్లి అనంత రెడ్డి నకిలీ డాక్యుమెంట్లతో తమ వెంచర్ లోని ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని పింక్ ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పోరాడుతున్న హర్ష ఆరోపించారు. మరోవైపు పింక్ ఎస్టేట్స్ భూమితో ఎలాంటి సంబంధం లేని హర్షవర్ధన్ రావు, హరికిరణ్ అనే వ్యక్తులు రాఘవేంద్ర సొసైటీ అంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని హర్ష తెలిపారు. పింక్ ఎస్టేట్స్ వెంచర్ ఫెన్సింగ్ తీసేసి తమ ప్లాట్లలో ఉన్న హద్దు రాళ్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఫిర్యాదు చేశామని హర్ష చెప్పారు. డబ్బులు పెట్టి ప్లాట్లు కొనుక్కున్న వారికి న్యాయం జరిగేందుకే పింక్ ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశామని హర్ష అన్నారు.