కాంటినెంటల్ ఆసుపత్రులలో ‘ఖయాల్ ఆప్‌కా’ అవగాహన కార్యక్రమం
నగరంలోని ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన కాంటినెంటల్ ఆసుపత్రులలో కొవిడ్-19 సంబంధిత ఒత్తిడి నుంచి బయటపడేందుకు రోగులు, వారి కుటుంబ సభ్యులకు ‘ఉచిత’ అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ‘ఖయాల్ ఆప్‌కా’.. అంటే ‘మీ సంరక్షణ బాధ్యత మాది’ అని అర్థం వస్తుంది. ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ శిల్పా అరాలికర్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలకు కారణమైన కొవిడ్-19 సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, అదే సమయంలో వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది పడుతున్న వారికి అవగాహన కల్పించేందుకు ఆమె సాయపడ్డారు.
ఈ సందర్భంగా డాక్టర్ శిల్పా అరాలికర్ మాట్లాడుతూ, “కొవిడ్-19 వైరస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజల జీవితాలను దారుణంగా ప్రభావితం చేసింది. దీనివల్ల చాలామందికి వ్యక్తిగతంగాను, సామాజిక ప్రభావాల వల్ల కూడా ఎంతో నష్టం కలిగింది. అలాంటివాళ్లు బలంగా నిలబడి, ఒత్తిడిని అధిగమించాలంటే వారికి ఒక ఆశాకిరణం అవసరం. ఖయాల్ ఆప్‌కా కార్యక్రమాల ద్వారా కాంటినెంటల్ ఆసుపత్రులలో మేము ప్రజలకున్న భయాలు, ఇబ్బందుల గురించి చర్చించేలా వారిని ప్రోత్సహిస్తూ, ఒత్తిడిని అధిగమించి వారు మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు ఏం చేయాలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మధుమేహం స్థాయి పెరగడానికి కారణాలేంటి, ఈ సమస్యను సమర్థంగా అధిగమించడం ఎలా అన్న విషయం మీద మేం ఈరోజు దృష్టి సారించాం” అన్నారు.
ఇలాగే గత వారం పోషకాహార, వెల్‌నెస్ నిపుణురాలు డాక్టర్ అనూరాధారెడ్డి “రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎలా” అనే అంశం మీద, కన్సల్టెంట్ పల్మనాలజిస్టు డాక్టర్ ప్రదీప్ సింహ కరూర్ అంతకు ముందువారం “ఈ మహమ్మారి సమయంలో ముందుకెళ్లడం ఎలా” అనే అంశం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఇలాంటివే మరిన్ని అవగాహన కార్యక్రమాల నిర్వహణను కాంటినెంటల్ ఆసుపత్రులు కొనసాగిస్తాయి.
ఇలా ఉచిత కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారికి కాంటినెంటల్ ఆసుపత్రులలో ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తున్నారు. ఇంట్లో ఒక కొవిడ్ రోగి ఉన్నప్పుడు తలెత్తే సమస్యలను సులభంగా అర్థం చేసుకుని, వాటిని అధిగమించేందుకు ఇలాంటి కౌన్సెలింగ్ కార్యక్రమాలు రోగుల కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతున్నాయి.