మెడీపై ధ్వ‌‌జమెత్తిన ‌మ‌మ‌త బెన‌ర్జీ

కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. నరేంద్ర మోదీ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. బెంగాల్‌ నుంచి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను వెనక్కి రావాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేస్తున్నాయన్నారు. కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై బెంగాల్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ విధుల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ ఆ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్‌పై రావాలంటూ శనివారం సమన్లు జారీ అయ్యాయి. ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన సీఎం మమత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అప్రజాస్వామిక శక్తులు, విస్తరణవాద కాంక్షతో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి ముందు పశ్చిమ బెంగాల్‌ ఎన్నడూ తల వంచదు. రాష్ట్ర యంత్రాంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అవలంబించిన ఈ విధానాన్ని మేం ఒప్పుకోము. బెంగాల్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యుటేషన్‌పై రమ్మన్న భారత ప్రభుత్వ ఆదేశాలపై మా రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐపీఎస్‌ కేడర్‌ రూల్‌ 1954లోని ఎమర్జెన్సీ ప్రొవిజన్‌ ప్రకారం ఈ ఆదేశాలు, అధికార దుర్వినియోగాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.