ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన నిర్ణయం తీసకున్న సర్కార్
ప్రభుత్వ ఉద్యోగులపై మహారాష్ట్ర సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్ పక్కన బెట్టి సంప్రదాయ దుస్తువులను పాటించాలని ఆదేశాలను జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు జీన్స్, టీషర్ట్, స్లిప్పర్స్ ధరించడంపై నిషేధం విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్ అమలులో భాగంగా ఉద్యోగులెవరూ విధి నిర్వహణలో డీప్, వింత వింత రంగుల్లో ఎంబ్రాయిడరీతో ఉన్న దుస్తులు, రంగుల చిత్రాలు ఉన్న దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలని సర్కారు సర్క్యులర్ విడుదల చేసింది.
మహిళా ఉద్యోగులు శారీ, సల్వార్, చుడీదార్-కుర్తా లేక కుర్తా-ప్యాంటు లేక షర్ట్ ధరించాలని, అవసరమనకుంటే దుపట్టా ధరించవచ్చని సర్క్యులర్‌లో పేర్కొంది. స్లిప్పర్స్‌కు బదులు చెప్పల్స్, శాండిల్స్ లేక షూస్ ధరించవచ్చని తెలిపింది. పురుషులు తప్పనిసరిగా ప్యాంట్లు, షర్ట్స్ ధరించాలని వెల్లడించింది. షూస్, శాండిల్స్ ధరించాలని చెప్పింది. ఇక చేనేత కార్మికులను పోత్సహించే ఉద్దేశంతో… ఉద్యోగులు వారంలో ఒకసారి ఖాదీ దుస్తులను ధరించవచ్చని తెలిపింది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు పద్ధతిగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దుస్తులను బట్టి పని విధానం ఆధారపడుతుందని తెలిపింది.