53 రోజులు ఎక్మోపై ఉన్న కోవిడ్ రోగికి రెండు ఊపిరితిత్తులు మార్చిన కిమ్స్ వైద్యులు
కోవిడ్‌తో తీవ్రంగా బాధపడుతూ.. 53 రోజుల పాటు ఎక్మోపై చికిత్స పొందిన రోగికి ఆ తర్వాత కూడా లంగ్ ఫైబ్రోసిస్ రావడంతో.. అతడి రెండు ఊపిరితిత్తులు మార్చారు. కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుపత్రిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు ఈ ఘనత సాధించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రఖ్యాత గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ సందీప్ అత్తావర్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసింది.
హర్యానాకు చెందిన 34 ఏళ్ల మార్కెటింగ్ ఉద్యోగికి 2020 అక్టోబర్ 29న కొవిడ్ సోకినట్లు గుర్తించారు. అతడిని తొలుత ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఎంత మంచి చికిత్స అందించినా, రోగి పరిస్థితి మరింత విషమించసాగింది. దాంతో అతడిని తొలుత వెంటిలేటర్ మీద ఉంచి, తర్వాత ఎక్మో చికిత్స అందించారు. కొవిడ్ కారణంగా రోగి ఊపిరితిత్తులు బాగా పాడైనట్లు పరీక్షలలో గుర్తించారు. చివరకు అవి తంతీకరణ దశకు (ఫైబ్రోస్) చేరుకున్నాయి. అతడికి ఊపిరితిత్తులు మార్చడం ఒక్కటే ఏకైక మార్గమని తేల్చారు. దాంతో రోగి కుటుంబసభ్యులు హైదరాబాద్ కిమ్స్‌లోని హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ బృందాన్ని సంప్రదించారు. అప్పటికే అతడి ఆరోగ్యం బాగా క్షీణించి సమస్యలు ఎక్కువయ్యాయి. అతడి రక్తప్రవాహంలోనూ ఇన్ఫెక్షన్ సోకింది. వ్యాధి కారణంగా ఎక్కువ కాలం పాటు మంచానికే అతుక్కుపోవడంతో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అతడిని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడం కూడా ఇబ్బంది అయ్యింది. దానికితోడు ఊపిరితిత్తులు ఎప్పుడు దొరుకుతాయో తెలియదు. ఇన్ని రకాల సవాళ్లు ఉన్నా కూడా.. ఆ యువకుడికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని డాక్టర్ సందీప్ అత్తావర్ బృందం నిర్ణయించుకుంది.
రోగిని తొలుత విజయవంతంగా కిమ్స్) ఆసుపత్రిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌కు తీసుకొచ్చారు. ముందుగా అతడికి తగిన యాంటీబయాటిక్స్‌తో ఇన్ఫెక్షన్ తగ్గడానికి చికిత్స చేశారు. అవయవమార్పిడికి సిద్ధం చేసేందుకు వీలుగా అతడికి మంచం వద్దే ఫిజియోథెరపీ చేశారు. 53 రోజుల పాటు ఎక్మో సాయంతో చికిత్స చేసిన తర్వాత రోగికి సరిపోయే ఊపిరితిత్తులు దొరికాయి. దాంతో 2020 నవంబర్ 21న రెండు ఊపిరితిత్తులూ మార్చారు.
ఈ చికిత్స గురించి ప్రోగ్రాం డైరెక్టర్, థొరాసిక్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రాం ఛైర్ డాక్టర్ సందీప్ అత్తావర్ వివరించారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్మో చికిత్స తర్వాత ఊపిరితిత్తులు మారుస్తుంటారని, కానీ భారతదేశంలో మాత్రం ఇన్ఫెక్షన్ల కారణంగా రోగులకు చాలా సమస్యలు వస్తాయని, కొంతమందికి వీటివల్ల మరణం కూడా సంభవిస్తుందని అన్నారు. ఇన్ని సమస్యల కారణంగా అవయవమార్పిడికి వేచి ఉండే సమయం పెరుగుతుందని చెప్పారు. ఈ కేసు విషయంలో.. ముందుగా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేసి, ఆ తర్వాత రోగికి శస్త్రచికిత్స చేసే సమయానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవడం పెద్ద సవాలు అన్నారు. ఇంకా ఊపిరితిత్తులు దొరకడానికి కొంత సమయం పట్టిందని, అన్నాళ్ల పాటు రోగికి ఇతర అవయవాలన్నీ సరిగ్గా పనిచేసేలా చూడటం కూడా ముఖ్యమేనని తెలిపారు.
కిమ్స్ ఆసుపత్రిలోని నిబద్ధత కలిగిన వైద్యబృందం నిరంతర సేవలు అందించడంతో రోగికి ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతంగా జరిగింది. 53 రోజుల పాటు సుదీర్ఘంగా ఎక్మోసాయంతో చికిత్స చేసిన తర్వాత కొవిడ్ రోగికి ఊపిరితిత్తులు మార్చడం భారతదేశంలో ఇదే మొదటిసారి.
దేశంలోనే గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స నిపుణుల్లో అత్యంత అనుభవం కలిగిన వారిలో డాక్టర్ సందీప్ అత్తావర్ ఒకరు. ఈ రంగంలో 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ అత్తావర్ ఇంతవరకు దాదాపు 12వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు, 250కి పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి, కృత్రిమ గుండె అమరిక (ఎల్‌వీఏడీ) లాంటి శస్త్రచికిత్సలు ఆయన చేతుల మీదుగా జరిగాయి.