క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే మందు బంద్ చేయాల్సిందే

క‌రోనా ప్ర‌జ‌ల‌ను పెడుతున్న క‌ష్టాలు అన్ని ఇన్ని కావు. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌ను అల్లాడించిన క‌రోనా… చివ‌రి ద‌శలో కూడా వ‌ద‌లడం లేదు. త్వ‌ర‌లో రానున్న వ్యాక్సిన్ కావాలంటే క‌ష్ట‌మైన ప‌ద్ద‌తులు పాటించాల్సిందే మ‌రీ. ఈ క‌ష్టాలు ఎంటో తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే.
మందు బాబులను కరోనా వ్యాక్సిన్ తెగ భయపెట్టిస్తోంది. వ్యాక్సిన్ తీసుకునే వారు రెండు నెలల పాటు మద్యానికి దూరంగా ఉండాలని రష్యన్ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రష్యన్ తయారీ ‘స్పుత్నిక్ వీ’ టీకా తీసుకునే కరోనా రోగులు, బాధితులు తప్పకుండా ఆల్కహాల్‌కు దూరంగా ఉండాల్సిందేనని నొక్కి చెప్పారు. ఈ ప్రకటనతో మందుబాబుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అన్ని రోజులు మద్యం లేకుండా ఎలా ఉండాలంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇండియా తదితర దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. దీంతో వ్యాక్సిన్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, ప్రపంచంలో తయారయ్యే కొవిడ్-19 టీకాల్లో 60 శాతం ఇండియాలోనే తయారుకానున్నాయి. అందుకు సంబంధించి భారత ప్రతినిధులు ఇతర దేశాల టీకా తయారీ సంస్థలతో చర్చలు కూడా జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో అందరికంటే ముందు కరోనా వ్యాక్సిన్‌ను తయారీ చేసినట్లు ప్రకటించుకున్న రష్యా కూడా ఇండియాలో టీకా డోసుల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా, ఇండియాలో బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా, ఇండియాకు చెందిన భారత్ బయోటెక్, కోవాగ్జిన్, ఫైజర్ వంటి టీకాలు కూడా చివరిదశ ట్రయల్స్‌లో ఉన్నట్లు సమాచారం.
అయితే, ‘స్పుత్నిక్ వీ’ డోసులను గనుక అందరికంటే ముందు ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తే మందు బాబులకు షాక్ తగిలినట్లే అని చెప్పుకోవచ్చు. మద్యం ప్రియులు తినకుండా ఐనా ఉంటారేమో గానీ, తాగకుండా అయితే ఉండలేరు. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్, మనదేశంలో సైతం ‘స్పుత్నిక్ వీ’ టీకా వినియోగానికి మందుబాబుల నుంచి వ్యతిరేకత ఏర్పడవచ్చు. అందుకు కారణం, ఈ టీకా తీసుకోవడానికి ముందు రెండు వారాల పాటు మద్యం మానేయాలి. అలాగే వ్యాక్సిన్ రెండు డోసులు (ఇంజక్షన్లు) కంటిన్యూగా తీసుకున్నాక 42 రోజులు మద్యం ముట్టకూడదని రష్యన్ అధికారి అన్నా పొపోవా స్పష్టం చేశారు. లేనియెడల సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చని హెచ్చరించారు. ఈ ప్రకటనతో రష్యా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుబాబులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.