నన్ను నన్ను గా చూసిందెవరు? 

ఎక్క‌డ స్త్రీలు న‌డ‌యాడుతారో అక్క‌డ దేవ‌త‌లు ఉంటారు అనేది ఓ నానుడి. అయితే ఇటీవ‌ల కాలంలో దేశంలో స్త్రీల‌పై జ‌రుగుతున్న ఆగాయిత్యాన‌లు మ‌నం నిత్యం చూస్తునే ఉన్నాం. వావి వ‌ర‌సలు మ‌రిచి, పెద్ద, చిన్న తేడా లేకుండా, పసిపాప నుండి పండు ముస‌లి వ‌ర‌కు ఇలా వారిపై ఆగాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. సాటి స్త్రీగా వారిపై జ‌రుగుతున్న దాడుల‌పై అక్ష‌ర రూపం దాల్చారు.
అను శ్రీ…

రక్త మాంసాల ఈ శరీర ముద్ద కూడ నాది కాదిక్కడ. అన్ని అధిపత్యాలు పరాయి వాళ్ళవే, ఒకరు అమ్మ అని, ఒకరు నాన్న అని.  అన్న తమ్ముడు, భర్త చివరికి కొడుకు కూడ ఇలా అందరికి నా మీద హక్కే, నాకే ఎవరీ మీద ఏ అధికారాలు వుండవు. దేవి, మాత, నారి అంటూ పేర్లు వేరుగా పెట్టుకున్న, మారుతున్న కాలంతో పాటు నా దేహానికి కాస్త రంగేసిన నేను నిన్నటి చరిత్రలోను, నేటి వర్తమానంలోను అందరికి “దాసీ” నే దానికి నిన్నటి పురాణాలూ, నేటి కుటుంబ వ్యవస్థలే ఉదాహరణలు. 

ప్రతి 15 నిమిషాలకొక అత్యాచారంపై, రోజురోజుకి పెరిగిపోతున్న హత్యలపై ఈరోజు కోపం చూపించే ప్రతి మగడిని గళ్ళ పట్టి లాగి అడగలనుంది నీ ఇంట్లో కూతురికి,చెల్లెకి భయం చెప్పి అదుపులో ఉంచాలని చూడటం కాకుండ నీ తమ్ముడికో, కొడుక్కో సాటి ఆడపిల్ల పట్ల ఎలాంటి విలువల్ని నేర్పావు అని? నీ చేల్లినో, బిడ్డనో బయట ఎవడో పోరంబోకు ఎదవ ఏడ్పుస్తుంటే, వెంటపడుతుంటే సహించలేని నువ్వు సినిమాల్లో ఓ పోరంబోకు క్యారెక్ట‌ర్‌ని హీరో చేసి దాన్ని ట్రెండ్‌గా చూపిస్తూ యువత చెడిపోడానికి అది బాటలు వేస్తుంటే దాన్ని బహిష్కరించమని నువ్వెందుకు డిమాండ్ చేయలేదని? మద్యం శరీరానికే కాదు, మానసిక స్థిరత్వానికి కూడ హానికరమే అది మనిషిని మత్తులో ముంచి మానభంగాల్ని, హత్యల్ని కూడ చేసేలా పురిగొల్పుతుందని తెల్సుకున్న నువ్వు ప్రభుత్వం తన సొంత లాభాల కోసం విచ్చలవిడిగా అమ్మకానికి అనుమ‌తి ఇస్తుంటే నువ్వెందుకు దానికి వ్యతిరేకంగా నోరు విప్పి మొత్తుకోలేదు? ఎంత సేపు బయట ఎక్కువ టైం వరకు ఉండకూడదు, మగపిల్లలతో మాట్లాడొద్దు, పొట్టి బట్టలేస్కోనే కూడదు అని మీ చెల్లెళ్ళకి, కూతుర్లకి మాత్రమే చెప్తారు? ఒక “మహిళ” శారీరికంగా మానసికంగా హింసించబడేది, పీడించబడేది ఒక “మగాడి” వాళ్ళే అని ఎపుడు తెలుసుకుంటారు. పీడించే వాళ్ళకి విలువలు నేర్పకుండ పీడితులని ఎన్నాళ్ళని కట్టడి చేసి ఉంచుతారు? ఇన్ని తప్పులు మీరు చేస్తూ ఈరోజు వాడెవడో బహిరంగంగా మా శరీరాల్ని పీక్కు తిని, చీల్చి, ముక్కలు చేసాడని వాన్ని ఉరి తీయాలంటున్నారు అలాంటి ఆ ఎధవలందరికి ఇంత ధైర్యాన్ని తెచ్చిపెట్టించింది మీలాంటి నోరు మెదపలేని శవాల వాళ్ళే. వాళ్ళని ఉరి తీయాలి అంటే అందుకు కారణం అయిన మిమల్ని ముక్కలు -ముక్కలుగా నరకాలి మరి.  

ప్రతి మతం నన్ను తొక్కిపెట్టడానికే, మతాచారాల పేరా కట్టుబాట్లు,  సాంప్రదాయాలన్ని నన్ను నా అస్తిత్వం నుంచి దూరం చేయడానికే. “కులాహంకార” కుట్రకి నా దేహం అనుభవిస్తున్న నరకం, ఒక్కొక్షణం నా మనసు పడే వేదనకి, ఆ రోదనకి కారణం ఈ “పితృస్వామ్య” బావజాలపు “ఆధిపత్యపు అధికారం” దాన్ని పెకిలించకుండ, దాని పునాదుల్ని తవ్వి ఏర్లని సైతం పీకి పారేయకుండ మనుషుల్ని చంపేయాలి అంటే నిన్ను నన్ను కూడ చంపాలి, పూడ్చి పెట్టాలి. 

మార్పనేది మనం ఎపుడు ఎదుటివారిలో ఆశిస్తాం కానీ మనం అది ఆచరించం అందుకే మన దేశం పురోగమనం వైపు కాకుండా తిరోగమనం వైపు వెళ్తుంది. కుళ్ళిపోయిన మెదళ్ళు సృష్టించే హింసాత్మాకమైన చర్యల వళ్ళ ఆడజాతి సగానికి పైగా అంతరించి పోతున్నది. మహిళని దేవతగా పూజించే ఈ దేశంలో మానభంగాలు, హత్యచారాల సంఖ్య, మహిళల్ని కేవలం ఒక మహిళగా మాత్రమే చూసే దేశంతో పోల్చుకుంటే ఎన్నో రేట్లు ఎక్కువ. అంటే శిక్షలు ఆపలేవు అత్యాచారాలనీ అని అనడానికి మంచి ఉదాహరణ సౌది అరేబియానే,  అక్కడ మానభంగం చేస్తే పబ్లిక్ గా నరికేస్తారు, చంపేస్తారు అని గొప్పగా చెప్పుకుంటూ ఇక్కడ ఇండియాలోనూ అలాంటి లా రావాలని వాదించేవాళ్ళు చాల మందే వున్నారు కానీ ఆ శిక్షలు నిజంగా అక్కడ మానభంగాలని, హత్యలని అరికట్టి వుంటే, ఒకప్పుడు సౌదీలో మానభంగాలకి ఇలాంటి శిక్ష “ఉండేదట” అనేవారు కానీ ఉంది అని ఇప్పటికి చెప్పుకురారు అంటే అంత కఠినమైన శిక్షలు కూడ అక్కడ మానభంగాన్ని ఆపలేవు. 

అత్యాచారాలని, హత్యలని శిక్షలు అరికట్టలేవు అవి మనిషిలో చైతన్యం వొచినప్పుడు, ఒక మనిషి వేరొక మనిషిని జాతి (ఆడ /మగ ), మత, కుల బేధాలు లేకుండ సాటి మనిషిగా చూసి గౌరవించినపుడు ఒకరిపట్ల ఒకరికి ప్రేమ భావం ఉంటుందే తప్ప అది వారిని నేరాలకు ఉసిగొల్పదు. ఇదంత జరగాలి అంటే వ్యవస్థ మారాలి……. కచ్చితంగా వ్యవస్థలో మార్పు రావాలి, కామ్రేడ్ లెనిన్ అన్నట్టుగా సమాజంలో ప్రతి చర్య రాజకీయంతో ముడిపడి వుంది దాన్ని అందరు గ్రహించాలి ముక్యంగా యువత, విద్యార్థి, మహిళలు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో అలోచించి ప్రశ్నించాలి, ఎదురు తిరగాలి. ఎందుకంటే తరతరల స్త్రీ బానిస సంకెళ్ళకి, తనింకా ఇలా అణచి పెట్టి ఉండటానికి మతం మాత్రమే కారణం కాదు, రాజకీయ కుట్ర కూడ కారణమే. ఈ రెండింటి కొమ్ములు విరచకుండా స్త్రీ పై జరిగే ఆధిపత్యాన్ని, ఆత్యచారాల్ని, హత్యల్ని దేన్నీ నివారించలేం. అలాగే మనిషి చనిపోయాక న్యాయం కోసం మనం ఎంత గొంతెత్తిన, పోరాడిన చనిపోయిన ఆ మహిళకి న్యాయం చేయలేం,అసలు ప్రాణాల్ని పోగొట్టుకున్న మహిళకి న్యాయం ఎ రకంగా సాధ్యమౌతుంది? తాను చనిపోవడంలో మన అందరి నిస్సహాయత, బాధ్య‌త‌రాహిత్యం ఉంటుంది. 

అందుకే మనిషిగా నువు మారి, విలువలు స్త్రీ -పురుష లింగ బేధం లేకుండ ఇద్దరికీ నేర్పి,మతాన్ని ధిక్కరించి వ్యవస్థ పునర్నిర్మాణానికి నువు కృషి చేసిన రోజు మహిళలు భయంలేని ఒక కొత్త సమాజంలో స్వేచ్ఛగ కనబడతారు. అపుడు పుడమి నెత్తురుతో తడవకుండ, పువ్వుల్ని విరబూయిస్తుంది, ఆ స్వేచ్చావాయువులోని శాంతి నీ హృదయాన్ని ముద్దాడుద్ది.