రేవంత్ పర్యటనతో నయాజోష్
- కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
- సుభాష్‌నగర్ డివిజన్‌లో సందడి
ఎంపీ రేవంత్‌రెడ్డి పర్యటనతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది. సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ, సుభాష్‌నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ యువ ఎంపీ రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు వివిధ పార్టీల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్రంలోను, జీహెచ్ఎంసీలోనూ ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. సుభాష్‌నగర్ డివిజన్‌లో గానీ, నగరంలో గానీ ఎక్కడా రోడ్ల దుస్థితిని పట్టించుకున్న పాపాన పోలేదని రేవంత్‌రెడ్డి అన్నప్పుడు స్థానికుల నుంచి మంచి స్పందన కనిపించింది. ముఖ్యంగా సుభాష్‌నగర్, సూరారం కాలనీ, పాండుబస్తీ తదితర ప్రాంతాలను గమనించినప్పుడు దాదాపు ప్రతి రోడ్డులోనూ అడుగుకో గుంత కనిపిస్తోందని, వీటిలో తట్టెడు మట్టి పోయించాలన్న సోయి కూడా సర్కారీ పెద్దలకు లేకపోయిందని రేవంత్ దునుమాడారు. ఈ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న యువ అభ్యర్థిని తనం శ్రావణి శ్రీధర్‌రెడ్డికి ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉందని, ఆమె కార్పొరేటర్‌గా ఎన్నికైతే జీహెచ్ఎంసీ నుంచి నిధులు రాబట్టి, రోడ్లు, డ్రైనేజి సదుపాయాలు ఏర్పాటు చేయించడంతో పాటు నాలాల పూడికతీత, వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయించడం లాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు చాలా చేస్తారని ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం కూడా ఇళ్లు మునిగిన తమకు ఇవ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తలే తమలో తాము పంచుకున్నారని డివిజన్‌లోని పలు బస్తీల వాసులు ఈ సందర్భంగా వాపోయారు. వారందరినీ తప్పక పట్టించుకుంటామని, ఎన్నిక కాగానే అర్హులందరికీ సాయం అందేలా తాను చూస్తానని శ్రావణి హామీ ఇచ్చారు.