ఆగం పట్టిన డివిజన్‌ను బాగుచేస్తా
- సుభాష్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిని తానం శ్రావణి శ్రీధర్‌రెడ్డి
- ఎంపీ రేవంత్‌రెడ్డి సమక్షంలో భారీగా కాంగ్రెస్‌లోకి చేరికలు
- రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ
సుభాష్‌నగర్ డివిజన్‌లో ఎటు చూసినా గుంతలు తేలిన రోడ్లు, సవాలక్ష సమస్యలతో ఆగం పట్టిందని, ఈ డివిజన్‌ను తాను శాయశక్తులా కృషిచేసి బాగుచేస్తానని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న తానం శ్రావణి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లలో ఈ డివిజన్‌లో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పుకొంటున్నా.. 5 రూపాయలు ఖర్చు చేసిన జాడ కూడా కానరావడం లేదని ఎద్దేవా చేశారు. నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. డివిజన్ పరిధిలోని పాండుబస్తీ, సూరారం కాలనీ, సుభాష్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆమె బుధవారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుమారు వందమందికి పైగా మహిళలు వివిధ పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరినవారు పలు సమస్యలను ప్రస్తావించారు. డివిజన్‌లో 70 ఏండ్లు దాటిన వారికీ వృద్ధాప్య పింఛన్లు రావడం లేదని, వరద సాయం ఒక్క రూపాయి కూడా నిజమైన బాధితులకు దక్కలేదని, భారీ వర్షాలు.. వరదలకు పాడైన రోడ్లను ఇంతవరకు బాగు చేసిన పాపాన పోలేదని చెప్పారు. ఈ సమస్యలపై శ్రావణి శ్రీధర్‌రెడ్డి స్పందిస్తూ.. అవసరమైతే తన సొంత సొమ్ము వెచ్చించైనా సరే వృద్ధులను ఆదుకుంటానని, నిరుపేద పిల్లలకు చదువులు చెప్పిస్తానని, రోడ్లు బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజలు ప్రస్తావిస్తున్న సమస్యలన్నింటినీ తాను కార్పొరేటర్‌గా ఎన్నికైతే తప్పక తొలి ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. ప్రధానంగా బస్తీ దవాఖానా ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు, కాలనీ బస్తీలలో అంతర్గత రోడ్లు, ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడం, పారిశుద్ధ్య కార్యకలాపాల మెరుగు, కాలుష్య కారక పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించడం, యువతకు ఉపాధి కల్పన తదితర కార్యక్రమాలపై ముందుగా దృష్టి పెడతానని ఆమె చెప్పారు.
భారీ బైక్ ర్యాలీతో రేవంత్‌రెడ్డికి స్వాగతం
బుధవారం సాయంత్రం డివిజన్ పరిధిలోని ఓం జెండా వద్ద రాంలీలా మైదానంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. సుభాష్‌నగర్ డివిజన్‌కు విచ్చేసిన రేవంత్‌రెడ్డికి యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. మహిళలు పెద్దసంఖ్యలో విచ్చేసి ఆయనకు హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, సుభాష్‌నగర్ డివిజన్ ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకురాలు మరికంటి భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.