ఓ మంత్రికి అతిద‌గ్గ‌రైన మ‌హిళ జీహెచ్ఎంసీ మేయ‌ర్ ప‌ద‌విపై క‌న్నేసింది ?

ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేత‌లంద‌రూ రూటు మార్చేస్తున్నారు. చేసిన ప‌ని చాలు ఇక రాజ‌కీయంలో దిగి రాజీలు చేద్దాం అంటూ డిసైడ్ అవుతున్నారు. త‌మ‌కు ఉన్న ప‌రిధిలో ఫైర‌వీలు మొద‌లు పెట్టారు. ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తుంది. ఇప్ప‌టికే మంత్రుల‌తో పెద్ద‌వారి ద‌ర్శ‌నాల‌కు క్యూ క‌డుతున్నారు అంటా.
అయితే అధికార పార్టీలో దాదాపు 30 శాతం కార్పొరేటర్లకు టికెట్లు దక్కవని బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ తరుపున మంత్రి కేటీఆర్ కూడా కొంతమంది కార్పొరేటర్లపై అసంతృప్తి ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేత ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచీ ఈ స్థానంపై ఆశతోనే ఉన్నట్లు చెప్పుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతుండటంతో టికెట్ కోసం కూడా ప్రయత్నాలు వేగంగానే చేస్తున్నారు. కాగా, మేయర్ స్థానం మహిళకు కేటాయించడంతో సదరు ఉద్యోగ జేఏసీ మహిళా నేతకు కలిసివచ్చి తనకు అవకాశం కల్పించాలంటూ వెంట పడుతున్నారు.
తాజాగా మంత్రి కేటీఆర్ దగ్గరకు తనతో సన్నిహితంగా ఉండే మరో మంత్రితో పాటుగా వెళ్లి కలిసి విజ్ఞప్తి చేసుకున్నారని సమాచారం. కేటీఆర్‌ను కలిసి తనకు అవకాశం కల్పించాలని, కూకట్‌పల్లి జోన్ పరిధిలో ఓ స్థానం నుంచి పార్టీ టికెట్ ఇప్పించాలని, మేయర్ స్థానానికి తననే ప్రకటించాలని కోరారు. అయితే ఈ ప్రచారం చాలా రోజుల నుంచి గ్రేటర్ రాజకీయాల్లో, ఉద్యోగ సంఘాల్లో జరుగుతున్నా… తాజాగా మంత్రి కేటీఆర్‌ను కలువడంతో ఊహాగానాలు మరింతగా పెరిగాయి. అయితే మంత్రి కేటీఆర్ నుంచి మాత్రం వ్యతిరేక సమాధానమే వచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వస్తే రావాలని, అంతేకానీ పదవులపై ఆశలు పెట్టుకోరాదని, ఇప్పుడున్నపరిస్థితుల్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేమని, ఉద్యోగ సంఘాల నేతలపై చాలా ఆరోపణలున్నాయంటూ సున్నితంగా మందలించినట్లు చెప్పుతున్నారు. మేయర్ స్థానాన్ని అప్పగించే అంశంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని సూచించినట్లు తెలిసింది. దీంతో మంత్రి కేటీఆర్‌ను ఒప్పించేందుకు ఇంకో మంత్రి, నేతలు కలిసి ప్రయత్నాలు చేసినా… కేటీఆర్ మందలింపు ధోరణితోనే తిరస్కరించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఖర్చు అంశాలు, వారి ఆర్థిక ధైర్యాలను కూడా మంత్రి కేటీఆర్‌కు వివరించినట్లు చెప్పుతున్నారు. కానీ కేటీఆర్ నుంచి మాత్రం వ్యతిరేక సమాధానమే వచ్చిందని చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాల్లోనే తనకే రాజకీయాలంటే ఇష్టం లేదని, ఇప్పుడే రాజకీయాలకు రామంటూ మాట మార్చి బయట ప్రచారం చేసుకుంటున్నారని ఉద్యోగ నేతలు చెప్పుతున్నారు.