అర్నాబ్ అరెస్ట్‌పై మండిపడ్డ అమిత్‌షా
ప్రమఖ జర్నలిస్ట్ , రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్,అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. అర్నాబ్ అరెస్ట్ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు కలిసి మరోసారి ప్రజాస్వామ్యాని అవమానించాయని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విటర్ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయి. అర్నబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీని అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దాడిని వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమైన పత్రికపై దాడిగా భావించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ తీరును చూస్తుంటే ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడిని మనమందరం ఖండించాలి’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, 2018లో డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.