దీపావళికి ఓటీటీలో సినిమా ధమకా
ఇప్పుడు థియేటర్‌కి వెళ్లి ఎవరూ సినిమా చూస్తున్నారా. కరోనా పుణ్యామా అని ఓటీటీలోనే విడుదల కానిచేస్తున్నారు. పైసా ఖర్చులేకుండా ఇంటిల్లిపాది కలిసి హాయిగా సోఫాలో కాలు మీద కాలేసుకొని చూస్తున్నారు. అయితే ఈ సినిమా అభిమానులకు దీపావళికి మరింత జోష్ వచ్చేలా మరిన్ని సినిమాలు విడుదల కానున్నాయి. నవంబరు 14వ తేదీ వరకూ దాదాపు ఓ పది సినిమాలు వివిధ ఓటీటీలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సినిమా థియేటర్ల విషయంలో ఇంకా స్పష్టత లేదు. మనం సినిమాల కోసం ఈ నెల 14వ తేదీ దాకా ఆగనవసరం లేదు. ఈ నెల 4వ తేదీ నుంచి సందడి మొదలుకానుంది. అక్కడి నుంచి వరుసగా సినిమాలు వివిధ ఓటీటీల్లో విడుదల కానున్నాయి. 4వ తేదీ కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ శుభారంభం పలుకుతుందో లేదో చూడాలి. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలవుతోంది. 6వ తేదీ ‘గతం’ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ‘లక్ష్మి’ 9వ తేదీన హాట్ స్టార్ లో విడుదలవుతోంది. ఇంతకుముందు తెలుగులో తెరకెక్కిన కాంచన సినిమానే హిందీలో ‘లక్ష్మి’గా రీమేక్ అయ్యింది. ఇక తమిళ హీరోసూర్య నటించిన ‘సూరారై పోట్రు’ కూడా ఈ దీపావళి టార్గెట్ గానే ప్రజల ముందుకు వస్తోంది. దీన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 12న విడుదలవుతోంది. అందరూ సినిమాలతో వస్తున్నప్పుడు ‘ఆహా’ కూడా వెనకడుగు వేయదలుచుకోలేదు. కన్నడంలో విడుదలైన కాళరాత్రి చిత్రానికి రేమేక్ గా తెరకెక్కిన ‘అనగనగా ఓ అతిథి’ చిత్రాన్ని 13వ తేదీ విడుదల చేయబోతోంది. దీనికి దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. దీంతో పాటు అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ, శీరత్ కపూర్ లతో రూపొందిన ‘మా వింత గాధ వినుమా’చిత్రాన్ని కూడా విడుదల చేస్తోంది. 13వ తేదీన అమెజాన్ ప్రైమ్ ‘ఛలాంగ్’ చిత్రాన్ని కూడా విడుదల చేయబోతోంది. స్కాం 1992 చిత్రం తర్వాత హన్స్ మెహతా రూపొందించిన చిత్రమిది. నెట్ ఫ్లిక్స్ కూడా ఈ 13వ తేదీన హిందీ సినిమాని విడుదల చేస్తోంది. ఆ సినిమా పేరు ‘లుడో’. అనురాగ్ బసు దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ఇక 14 వ తేదీ పండగ రోజున నయన తార ‘మూకూతి అమ్మన్’గా రాబోతోంది. ఇది తమిళంలో తెరకెక్కిన చిత్రం. దీన్ని హాట్ స్టార్ విడుదల చేయబోతోంది. ఇలా వరుసగా అనేక సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఈ దీపావళి సమయానికి 100 శాతం అక్యుపెన్సీ ఉంటే మాత్రం థియేటర్లు కూడా కళకళ లాడతాయి. లేకపోతే అవి వెలవెల పోవలసిందే.