ఏపీలో సీఎం రీలిఫ్ ఫండ్ పథకం ఇక లేనట్టేనా ?
అన్ని అందిస్తున్నాం ఇక అది ఎందుకు, అనసవరమైన ఖర్చు అని ఓ లెక్కకు వస్తున్నట్లు ఉంది ఏపీ సర్కార్. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో 2000కుపైగా జబ్బులను చేర్చడంతో, ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కు స్వస్తి పలకాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనేక మంది పేదలకు భరోసాగా నిలిచిన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్కువగా అనారోగ్య కారణాలను చూపుతూ రూ.20 వేల నుంచి రూ.25 లక్షలదాకా సాయం పొందుతున్నారు. ఇక నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసే అవకాశాలు దాదాపు కనుమరుగైనట్టే అని సమాచారం. సీఎం రిలీఫ్ ఫండ్‌ను అధికారికంగా ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. ఎవరైనా కావాల్సిన వారికి సాయంచేయాల్సి వస్తే వెంటనే నిధులివ్వడానికి ఉన్న ఏకైక అవకాశం అందుకే అధికారికంగా ఈ పథకం రద్దు చేయరు. ఏదైనా అత్యవసర సందర్భాల్లో.. దానిని వాడాలనే అనుకుంటున్నారు.
కానీ వైసీపీ నాయకులను పరోక్షంగా సంకేతాలు పంపిచారట. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం కార్యాలయానికి రావద్దని ఆ సందేశం సారాంశం. ఇప్పటికే వైసీపీ నాయకులకు అర్ధమై పోయిందట. అందుకే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్ల కాలంలో రూ.1800 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్ధిక సాయం అందించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సర కాలంలో కేవలం రూ.20 కోట్ల మాత్రమే విడుదల చేశారని సమాచారం.
అయితే ఇటీవల సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కులను ఫోర్జరీ చేసి రూ.117 కోట్లు కాజేయాలని కొందరు అక్రమార్కులు వేసిన ప్రణాళికను, అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయంటున్నారు. ఇక సాధ్యమైనంత వరకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని రద్దు చేయకుండానే, దరఖాస్తులు తీసుకురాకుండా వైసీపీ నాయకులకు సంకేతాలు పంపారు. అంటే పథకం ఉంటుంది. కానీ పేదలు దీనికోసం ప్రయత్నం చేయవద్దని పరోక్షంగా చెప్పినట్టయింది.
ఆరోగ్యశ్రీ పథకంలో 2000పైగా జబ్బులను చేర్చాం. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు అని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట. ఇప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్న దరఖాస్తులను పరిశీలించి వాటిలో ఉన్న జబ్బులకు ఆరోగ్యశ్రీలో కవరేజీ లేకపోతే వాటిని కూడా చేర్చాలని సీఎం ఆదేశించారని తెలుస్తోంది. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ పై ఇక ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని తేల్చి చెప్పినట్టయింది.