నెలలు నిండని శిశువుకు ప్రాణదానం
నెలలు నిండకముందే పుట్టే శిశువులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఇలాంటి పిల్లలను హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో అయితే ఇంక్యుబేటర్లలో పెట్టి, నియోనేటల్ ఐసీయూలో కంటికి రెప్పలా కాపాడి అత్యాధునిక సదుపాయాలతో చికిత్సలు అందిస్తారు. కానీ అనంతపురం లాంటి పట్టణాల్లోనూ ఇలాంటి శిశువుల ప్రాణాలు కాపాడటం అంటే ఒకరకంగా కత్తిమీద సామే. గర్భం దాల్చినపుడు తల్లికి రక్తపోటు పెరగడం, లోపల ఉన్న శిశువుకు రక్త సరఫరా తగ్గి డాప్లర్ మార్పులు కనపడటంతో అనంపురం పట్టణానికి చెందిన లలిత (26) అనే మహిళకు ఏడో నెలలోనే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. పుట్టేసరికి ఆ ఆడశిశువు బరువు కేవలం 1180 గ్రాములు మాత్రమే. నెలలు నిండకముందే పుట్టడం వల్ల పాప బరువు బాగా తక్కువగా ఉందని అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రిలోని ఎన్ఐసీయూలో చేర్చారు. అక్కడ పాపకు చేసిన చికిత్స విధానాలను కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ పీవీ రాఘవయ్య వివరించారు.
“పాప ఊపిరితిత్తులు పూర్తిగా రూపొందకపోవడంతో ఊపిరి పీల్చుకోవడం కూడా బాగా కష్టమైపోయింది. అందువల్ల ఆమెకు ముందుగా సర్ఫాక్టెంట్ అనే మందును గాలి వెళ్లే మార్గంలో ఒక ట్యూబు ద్వారా ఇవ్వడంతో తొలుత ఊపిరి అందడం మొదలైంది. తర్వాత పాపకు సెప్సిస్ (పూతిక) రావడంతో 5 రోజుల పాటు వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. పీఐసీసీ అనే సాధనంతో (పెరిఫెరల్లీ ఇన్సర్టెడ్ సెంట్రల్ కాథటర్) పాపను జాగ్రత్తగా కాపాడుకున్నాము. మందులు ఇవ్వడానికి ఈ తరహా పరికరాలు ఉపయోగించడం అనంతపురం లాంటి పట్టణాల్లో చాలా అరుదు. ఆ తర్వాత పాపకు ఓరో గ్యాస్ట్రిక్ ట్యూబు ద్వారా ముక్కులోంచి ఆహారం పంపుతూ, తర్వాత కంగారూ మదర్ కేర్ ఏర్పాటుచేశాము. బిడ్డ తల్లి లలితకు ఈ తరహా ఫీడింగ్ విషయంలోను, కంగారూ కేర్ విషయంలోనూ పూర్తిస్థాయిలో శిక్షణ అందించాం. 30 రోజుల పాటు ఇలా అత్యంత జాగ్రత్తగా చికిత్స అందించిన తర్వాత పాప 1350 గ్రాముల బరువుకు చేరుకుంది. ఇక మరే విధమైన ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో ఆ తర్వాత పాపను డిశ్చార్జి చేశాము. సాధారణంగా ఇలా నెలలు నిండని పిల్లలకు చికిత్స చేయాలంటే మంచి పీడియాట్రిక్ టీమ్, గైనకాలజిస్టు, రేడియాలజిస్టు, ఆఫ్తల్మాలజిస్టు, ఈఎన్‌టీ వైద్యులతో పాటు మంచి నర్సింగ్ సేవలు కూడా అవసరం అవుతాయి. కిమ్స్ సవీరా ఆసుపత్రిలో డాక్టర్ పీవీ రాఘవయ్య, డాక్టర్ మహేష్ తదితరులతో కూడిన పీడియాట్రిక్ టీమ్, ఇతర సదుపాయాలన్నీ అందుబాటులో ఉండటంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు కూడా ఉండటంతో పాప ప్రాణాలు కాపాడగలిగాం” అని ఆయన తెలిపారు.