సంక్లిష్టమైన చికిత్స చేసిన కిమ్స్ కర్నూలు వైద్యుడు మనోజ్
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణం. కానీ, మూత్రపిండాలు ఉండాల్సిన చోట కాకుండా వేరే సంక్లిష్టమైన చోట ఉండి.. వాటి చుట్టూ వేరే అవయవాలు కూడా ఉన్న స్థితిలో వాటిలో ఉన్న రాళ్లను తీయడం అంత సులభం కాదు. మూత్రపిండాలు ఇలా వేరేచోట ఉండటాన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటారు. సుమారు 3-4వేల మందిలో ఒకరికి మాత్రమే ఇలా ఉంటుంది. వాళ్లకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం కూడా అరుదే.
కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలికి ఇలా ఎక్టోపిక్ మూత్రపిండాలున్నాయి. వాటిలో రాళ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పి ఉండటంతో పలు ఆసుపత్రులకు తిరిగారు. కానీ ఎక్కడా ఈ చికిత్సలో ఉన్న సంక్లిష్టత కారణంగా కేసు తీసుకోలేదు. దాంతో ఆమె కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి రాగా, అక్కడి కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ మనోజ్ కుమార్ ముందుగా సీటీ స్కాన్, మరియు ఐవీపీ (ఇంట్రావీనస్ పైలోగ్రామ్) పరీక్షలు చేశారు. వీటిలో కుడి మూత్రపిండంలో 17 మి.మీ., 13 మి.మీ. పరిమాణంలోని రెండు రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పైగా మూత్రపిండాలు ఉండాల్సిన చోట, ఉండాల్సిన స్థితిలో కాకుండా.. మూత్రాశయానికి పైన కటిప్రాంతంలో ఉన్నాయి. ఇవి సాధారణంగా కాకుండా కొంత తిరిగిపోయి ఉండటం, దానిలోకి మూత్రనాళం కూడా చాలా విభిన్నంగా వెళ్లడం లాంటి సమస్యలను గుర్తించారు. మూత్రపిండం ఇలా విభిన్నంగా ఉండటం వల్ల మూత్రం పూర్తిగా పోకుండా కొంత అందులోనే ఉండిపోవడం, దానివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తినట్లు డాక్టర్ మనోజ్‌కుమార్ వివరించారు. ఈ అసాధారణ స్థితి వల్ల మూత్రపిండం చుట్టూ ఉండాల్సినంత ఖాళీ ఉండదని, దాని చుట్టుపక్కల ప్రేగులు కూడా ఉంటాయని తెలిపారు. మామూలుగా అయితే శరీరం వెనక భాగంలో చర్మం తర్వాత ఉండే కండరాల కిందనే ఉండటం వల్ల నేరుగా వాటిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని, కానీ పొట్టలో మూత్రపిండం ఉండటం వల్ల ఆపరేషన్ చేయడానికి రంధ్రం చేస్తే అది ప్రేవులకూ పడే ప్రమాదం ఉంటుందని ఆయన చెప్పారు. పైపెచ్చు దానికొచ్చే రక్తసరఫరా కూడా చాలా విభిన్నంగా ఉంటుందని, నాలుగైదు రక్తనాళాలు కూడా ఉండొచ్చని అన్నారు. ఉండాల్సిన స్థలంలో ఉండకపోవడం, దానిచుట్టూ వేరే అవయవాలు ఉండటం, మూత్రపిండం పరిస్థితి ఎలా ఉందో, దానికి ఎన్ని రక్తనాళాలున్నాయో కచ్చితంగా చెప్పలేకపోవడం, దాని వరకు వెళ్లడానికి మార్గం కూడా సరిగా లేకపోవడం.. ఇలాంటి సమస్యలన్నీ ఈ కేసులో ఉన్నాయని, దానికితోడు రోగి వయసు కూడా 60 ఏళ్లు కావడం.. అప్పటికే ఆమెకు రకరకాల సర్జరీలు జరగడం లాంటి ప్రతికూలతలు ఉన్నాయని వివరించారు.
పెల్విక్ ఎక్టోపిక్ మూత్రపిండాల్లో రాళ్లను తీయడానికి సాధారణంగా షాక్‌వేవ్ లితోట్రిప్సీ (ఎస్‌డబ్ల్యుఎల్), రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (ఆర్ఐఆర్ఎస్), అల్ట్రాసౌండ్ లేదా లాప్రోస్కొపీ గైడెడ్ పీసీఎన్ఎల్ ఉంటాయని డాక్టర్ మనోజ్‌కుమార్ చెప్పారు. “ఈ మూత్రపిండాల చుట్టూ పేగులు, ఎముకలు ఉండటంతో ఎస్‌డబ్ల్యుఎల్ పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. ప్రేగులను పక్కకు నెట్టి, అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చూసుకుంటూ అప్పుడు మూత్రపిండంలోకి సన్నటి రంధ్రం చేసి, దానిద్వారా రాళ్లు తీయాల్సి వచ్చింది. పైగా లోపల పగలగొట్టిన రాళ్లను తీయడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అన్ని సందర్భాల్లో ఆర్ఐఆర్ఎస్ కూడా విజయవంతం కాదు. ఒకే దశలో మొత్తం అన్ని రాళ్లనూ తీయడం కూడా కుదరదు. ఇప్పటికే రోగికి పలు శస్త్రచికిత్సలు అయినందువల్ల లాప్రొస్కోపిక్ సర్జరీ కూడా ఈమెకు చేయడం చాలా కష్టం.
దాంతో చివరకు అల్ట్రాసౌండ్ గైడెడ్ మినీ పీసీఎన్ఎల్ (చిన్న పరిమాణంలోని పరికరాలతో) చేయాలని నిర్ణయించారు. ఎక్టోపిక్ మూత్రపిండాన్ని చేరుకోవడంలో ఉన్న ఇబ్బందులు.. 1) చుట్టుపక్కల ఉన్న పేగులకు గాయం అయ్యే ప్రమాదం. 2) రక్తనాళాలు అసాధారణంగా ఉండటం వల్ల వాటి నుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం 3) పెరిటోనియల్ కేవిటీలోకి ద్రవాలు చిందే ప్రమాదం.
ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు పేగులను పక్కకు తోసి, వాటికి గాయం కాకుండా చూసుకుని.. అల్ట్రాసౌండ్ స్కాన్ సహాయంతో లోపలి పరిస్థితిని గమనిస్తూ అత్యంత చిన్న పరికరాలతో శస్త్రచికిత్స చేశారు. ఈ తరహా చిన్న పరికరాలు కిమ్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం చాలా మేలు చేసింది. అదే పెద్ద పరికరం అయితే పెద్ద రంధ్రం చేయాల్సి రావడంతో పాటు గాయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నది ఉంది కాబట్టి ముప్పు అవకాశాలు కూడా తక్కువ. ఇలా విజయవంతంగా ఆమెకు శస్త్ర చికిత్స ముగిసింది. ఆపరేషన్ తర్వాత మళ్లీ స్కాన్ తీయగా.. రాళ్లు మొత్తం పోయినట్లు నిర్ధారణ అయయింది. రెండు రోజుల అనంతరం రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశాం” అని ఆయన వివరించారు.
ఇది చాలా అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స. ఎండోయూరాలజీ స్టోన్ మేనేజ్‌మెంట్‌లో నిపుణులైన డాక్టర్ మనోజ్‌కుమార్ కిమ్స్ ఆసుపత్రిలో ఉండటం, దానికితోడు ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాల వల్ల ఎలాంటి సమస్య లేకుండా రోగికి ఇబ్బందిని పూర్తిగా తొలగించారు. ఈ శస్త్రచికిత్సలో సహకరించిన రేడియాలజిస్టు డాక్టర్ అశోక్ కుమార్‌కు ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.