కేరళ కొత్త జంట ఫొటోస్ ట్రోలింగ్ అందుకే తెలుసా

రిషి కార్తికేయన్‌, లక్ష్మి.. కేరళకు చెందిన నవ దంపతులు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబరు 16న అతికొద్ది మంది సమక్షంలో ఇరు వర్గాల పెద్దలు వీరి వివాహ తంతు జరిపించారు. కరోనా నిబంధనల నడుమ, పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి ఎలాగూ సింపుల్‌గా జరిగింది కాబట్టి, పోస్ట్‌- వెడ్డింగ్‌షూట్‌ అయినా కాస్త వెరైటీగా ప్లాన్‌ చేసుకోవాలనుకున్నారు ఈ కొత్తజంట. అనుకున్నదే తడవుగా ఫొటోగ్రాఫర్‌ అయిన తమ స్నేహితుడితో ఈ ఆలోచనను పంచుకున్నారు. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఇడుక్కిలోని తేయాకు తోటలను ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. తమ మధ్య ప్రణయ బంధాన్ని ప్రతిబింబించేలా ఫొటోలు తీయించుకున్నారు.

  • ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఎప్పుడైతే తమ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారో, అప్పటి నుంచి రిషి, లక్ష్మిల మీద ట్రోలింగ్‌ మొదలైంది. తెల్లటి వస్త్రంతో తమను తాము కప్పుకొని, పరుగులు తీస్తున్నట్లుగా సినిమాటిక్‌ స్టైల్‌లో తీసిన ఫొటోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలు ఇదంతా ఏమిటి? ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతకీ మీరు దుస్తులు ధరించారా? పిచ్చి పీక్స్‌ వెళ్లడం అంటే ఇదే. పెళ్లి తాలూకూ మధుర జ్ఞాపకాలు దాచుకునేందుకు ఇంతకంటే మార్గం దొరకలేదా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించి వధువు లక్ష్మి.. ‘‘ఆఫ్‌- షోల్టర్‌ టాప్స్‌ ధరించే వాళ్లకు ఇది కొత్తగా ఏమీ అనిపించకపోవచ్చు. అయినా మేం ఏం తప్పుచేశామని ఇలా నిందిస్తున్నారు. చూసే కళ్లను బట్టే ఉంటుంది’’అంటూ విమర్శలకు బదులిచ్చారు.