80 ఏళ్ల వృద్ధురాలికి వెన్నెముకలో కేన్సర్ కణితి పూర్తిగా తొలగింపు
- గుండె వైపు నుంచి అరుదైన శస్త్ర చికిత్స చేసిన కిమ్స్ వైద్యులు
- కృత్రిమ ఎముక అమరిక.. పూర్తిగా కోలుకుని నడుస్తున్న వృద్ధురాలు
వెన్నెముకలోకి కేన్సర్ కణితి వ్యాపించి, కూర్చోవడానికి.. నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్న 80 ఏళ్ల వృద్ధురాలికి కిమ్స్ వైద్యులు సరికొత్త జీవితాన్ని అందించారు. సాధారణ శస్త్రచికిత్సలను సైతం ఆ వయసులో చేయించడానికి కాస్త వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. కానీ, అత్యంత సంక్లిష్టంగా గుండెను పక్కకు జరిపి పాడైన ఎముకను తొలగించి.. దానికి బదులు కృత్రిమ ఎముకను అమర్చి ప్లేట్లు, స్క్రూలతో దాన్ని సక్రమంగా ఉంచడంతో ఆమె ఇప్పుడు పూర్తిగా తనంతట తాను లేచి నిలబడి, నడవగలుగుతున్నారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ కె. శ్రీకృష్ణ చైతన్య నేతృత్వంలో చేశారు. శస్త్రచికిత్స చేసిన వారం రోజుల్లోనే రోగి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపేశారు.
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జీకేఎస్ ప్రభావతి (80) థైరాయిడ్ కేన్సర్ తో రెండేళ్ల నుంచి బాధపడుతున్నారు. ఆరు నెలల క్రితం వెన్నెముకకూ (మెటాస్టాసెస్ లేదా సెకండరీ) కేన్సర్ పాకింది. కానీ, సరిగ్గా ముందువైపు గుండె, ప్రధాన రక్తనాళాలు ఉండే ప్రదేశంలోనే.. అంటే వెన్నెముకలోని డోర్సల్ 2, డోర్సల్ 3 వద్ద ఈ కణితి ఉండటంతో అక్కడ శస్త్రచికిత్స చేయడం చాలా సంక్లిష్టం. దాంతో ముందుగా కణితికి రేడియోథెరపీ, రేడియో అయోడిన్ అబ్లేషన్ చేయించారు. ఆ తర్వాత ఆమెకు ఈ కణితి కారణంగానే డి2 వద్ద ఎముక ఫ్రాక్చర్ కావడంతో కూర్చోలేకపోవడం, కాళ్లు పడిపోవడం లాంటి సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలన్నింటితో ఆమె కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ చైతన్య ఆమెను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మొత్తం కణితిని తొలగించాలని సలహా ఇచ్చారు. ముందుగా కణితికి రక్తప్రసారాన్ని తగ్గించేందుకు శస్త్రచికిత్సకు 24 గంటల ముందు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు కణితికి ఎంబొలైజేషన్ చేశారు. దాని రక్తనాళాల్లోకి ఒక ప్రత్యేకమైన జెల్ పంపించడం ద్వారా రక్తప్రసారాన్ని ఆపేశారు. లేనిపక్షంలో శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించేటప్పుడు రక్తస్రావం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత ఇద్దరు స్పైన్ సర్జన్లు, ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ కలిసి శస్త్రచికిత్స చేశారు.
ఇటువంటి శ్రస్తచికిత్సల్లో పరికరాలను అరుదుగా వాడుతారని ఛీఫ్ ఆర్థోఫెడిషియన్ డాక్టర్ సాయి లక్ష్మణ్ తెలిపారు. ముందుగా సెర్వైకో థొరాసిక్ పెడికల్ స్క్రూలను ఉపయోగించి ఆమెకు పాడైన ఎముకను పూర్తిగా తీసేసి దాని స్థలంలో కృత్రిమ ఎముకను ప్లేట్లు, స్క్రూలతో అమర్చారు. వెనక నుంచి తీయడానికి వీల్లేకపోవడంతో కార్డియోథొరాసిక్ సర్జన్ సాయంతో గుండెను తాత్కాలికంగా కాస్త పక్కకు జరిపి.. అక్కడ ఎముకను తీసి కొత్త ఎముక పెట్టారు. చివరగా మొత్తం కణితి తొలగించారు. శస్త్రచికిత్స చేసే సమయంలో నరాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండేందుకు ఇంట్రా ఆపరేటివ్ న్యూరల్ మానిటరింగ్ అనే పద్ధతిని ఉపయోగించారు. ఎక్కడా వాటి పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త తీసుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత రోగి కొంత సపోర్టుతో నడవగలగడం మొదలైంది. అందుకు కావల్సిన బలం ఆమెకు వచ్చింది. ఆపరేషన్ తర్వాత తీసిన సీటీ, ఎంఆర్ఐ స్కానింగులలో కణితి పూర్తిగా తొలగిపోయినట్లు కనిపించింది.