కీళ్ల వాతం అందుకే వస్తుంది : డాక్టర్ శరత్ చంద్రమౌళి
డాక్టర్ వి. శరత్ చంద్రమౌళి
కన్సల్టెంట్ రుమటాలజిస్టు
కిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్
ఆర్థరైటిస్ (కీళ్లవాతం) అనేది కొన్ని వ్యాధుల కలయిక. దానివల్ల కణుపుల వద్ద వాపు వస్తుంది. ఇది ఒక కీలు లేదా పలు కీళ్లను ప్రభావితం చేయొచ్చు. దాదాపు 100 రకాల ఆర్థరైటిస్ లు ఉన్నాయి. వాటికి వేర్వేరు కారణాలు, వేర్వేరు చికిత్సా పద్ధతులు ఉంటాయి. చాలా ఎక్కువగా కనపడేవాటిలో ఆస్టియో ఆర్థరైటిస్ (ఓఏ), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ), ఎస్ఎల్ఈ (లూపస్), స్పాండిలోఆర్థరైటిస్, గౌట్ ఉన్నాయి.
అక్టోబర్ 12 ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా రుమాటిక్ మరియు మస్క్యులోస్కెలెటల్ వ్యాధులు ఉన్నవారు కలిసి తమ గొంతు వినిపిస్తున్నారు. దీన్ని తొలిసారి 1996లో గుర్తించారు. తర్వాత క్రమంగా ఆర్థరైటిస్ అండ్ రుమాటిజం ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రుమాటిక్ మరియు మస్క్యులోస్కెలెటల్ వ్యాధులపై అవగాహన పెంచడం మొదలుపెట్టింది.
ఆర్థరైటిస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 35 కోట్ల మందిని ప్రభావితం చేస్తోంది. వారిలో 10 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. 2020 సంవత్సరానికి ప్రపంచ ఆర్థరైటిస్ డే ఇతివత్తం ‘‘టైమ్ టూ వర్క్’’
ప్రపంచ ఆర్థరైటిస్ డే నిర్వహణ లక్ష్యం ఏంటి?
వైద్యులు, సామాన్య ప్రజల్లో రుమాటిక్ మరియు మస్క్యులోస్కెలెటల్ వ్యాధులపై అవగాహన పెంచడం .
రుమాటిజం అంటే ఏంటి?
కీళ్లు, ఎముకలు, అస్థిబంధకాలు, కండరాలు.. ఇలాంటి ప్రాంతాల్లో నొప్పి వచ్చే అనారోగ్యం.
ఆర్థరైటిస్ అంటే ఏంటి?
ఆర్థరైటిస్ అంటే కీళ్ల వాతం. దీని లక్షణాలు కీళ్ల దగ్గర నొప్పులు, వాపులు రావడం, కీళ్లపై ఉన్న చర్మం ఎర్రగా కందడం, అక్కడ వేడిగా ఉండటం.
ఆర్థరైటిస్ అనేది ఒక్క వ్యాధేనా?
వైద్య శాస్త్రంలో దాదాపు 100 రకాలకు పైగా ఆర్థరైటిస్ పరిస్థితులను వివరించారు. వాటిలో ఆస్టియోఆర్థరైటిస్, గౌట్ నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ లాంటి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్లు కూడా ఉంటాయి.
ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికి వస్తుంది?
రుమాటిక్ వ్యాధులు అన్ని వయసుల వారికి, అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
రుమాటిక్ వ్యాధులు రోజువారీ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. త్వరగా గుర్తించడమే మరింత నష్టాన్ని నివారించడానికి కీలకం.
ఆర్థరైటిస్ గుర్తింపు కొన్నిసార్లు ఏళ్ల తరబడి ఆలస్యమవుతుంది. ఉదా: రుమటాయిడ్ ఆర్థరైటిస్ 2 ఏళ్లు, లూపస్ 3 ఏళ్లు, యాంకీలూజింగ్ స్పాండిలైటిస్ 10 ఏళ్లు, జోగ్రెన్స్ సిండ్రోమ్ 20 ఏళ్లు.
దీని గురించి అవగాహన లేకపోవడం, నిపుణులు అందుబాటులో లేకపోవడమే గుర్తించడంలో ఆలస్యానికి ప్రధాన కారణం. చాలామంది రోగులు ఆర్థోపెడిక్, న్యూరాలజిస్టు లేదా జనరల్ ఫిజిషియన్ వద్దకు వెళ్తారు. కానీ రుమాటిక్ నొప్పులకు తప్పనిసరిగా రుమటాలజిస్టు వద్దకు వెళ్లాలి.
త్వరగా గుర్తించి, సరిగా చికిత్స చేయకపోతే రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టం, జీవన నాణ్యత తగ్గుతుంది, శారీరక సామర్థ్యాలు ప్రభాితమవుతాయి.
భారతదేశంలో పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చు?
జనరల్ ఫిజిషియన్లకు అవగాహన పెంచడం ద్వారా పరిస్థితిని మెరుగుపరచవచ్చు. అలాగే తల్లిదండ్రులకు కూడా దీని లక్షణాల గురించి చెప్పడం, దేశంలో శిక్షణ పొందిన రుమటాలజిస్టుల సంఖ్య పెంచడం మరో మార్గం.
భారతదేశంలో రుమాటలజీ శిక్షణ కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. మన దేశంలో మరో 20వేల మందికి పైగా రుమటాలజిస్టులు అవసరం. ప్రస్తుతం 800 మంది మాత్రమే ఉన్నారు. అవసరాలు తీరాలంటే రుమటాలజీలో మరిన్ని డీఎం, డీఎన్ బీ, ఫెలోషిప్ కార్యక్రమాలు అవసరం. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తగిన చర్యలు తీసుకుని దేశంలో రుమటాలజీ శిక్షణ కేంద్రాలు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాలి. అలాగే మరిన్ని పోస్ట్ డాక్టొరల్ (ఎండీ తర్వాత) రుమటాలజీ ఫెలోషిప్ ప్రోగ్రాంలను కూడా దేశవ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రుల్లో ఎన్ఎంసీ అనుమతించాలి. 100 బోధనాసుపత్రుల్లో ఒక్కోదాంట్లో ఏడాదికి రెండు ఫెలోషిప్ లను అనుమతించినా, 20 వేల మంది రుమటాలజిస్టులు తయారుకావడానికి 100 ఏళ్లు పడుతుంది. ఇది దారుణమైన పరిస్థితి.
చాలావరకు ఆసుపత్రుల్లో రుమటాలజీ సేవలు లేకపోవడంతో లక్షలాదిమంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. గుర్తింపు ఆలస్యం కావడం, సరైన చికిత్సలు అందక లక్షలాదిమంది రుమటాలజీ రోగులు మరణిస్తున్నారు.
భారతదేశంలో ఆర్థరైటిస్ రకాలు ఏవేంటి?
ఆర్ఎండీలు (రుమాటిక్ మస్క్యులోస్కెలెటల్ వ్యాధులు) వాపు, వాపులేని పరిస్థితులుగా వర్గీకరించారు.
వాపు లేని వ్యాధులు: మోకాళ్ల వద్ద ఆస్టియోఆర్థరైటిస్, వెన్నెముక అరిగిపోవడం, ఆస్టియోపోరోసిస్ మరియు ఫైబ్రోమయేల్గియా
వాపు ఉండే వ్యాధులు: సాధారణ వాపు ఉండే రుమాటిక్ వ్యాధుల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, యాంకీలూజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, డెర్మటోమయోసైటిస్, సెలెరోడెమర్మా, మిక్స్ డ్ కనెక్టివ్ టిష్యూ వ్యాధులు, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నాయి.
ఆర్ఎండీలు పురుషులు, మహిళలు, పెద్దలు, పిల్లలకూ వస్తాయి.
చాలావరకు ఆటోఇమ్యూన్ రుమాటిక్ వ్యాధులు మహిళలకు ఎక్కువగా వస్తాయి.
స్పాండిలోఆర్థరైటిస్ మరియు గౌట్ ఎక్కువగా పురుషులకు వస్తాయి.
ఆస్టియోఆర్థరైటిస్ మరియు ఆస్టియోపోరోసిస్ వృద్ధులలో కనిపిస్తాయి.
జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పిల్లల్లో ఉంటుంది.
సిక్ లీవులు, ముందస్తు పదవీ విరమణలకు చాలావరకు ఆర్ఎండీలే ప్రధాన కారణం.
చికిత్స చేయకపోతే కొన్ని ఆర్ఎండీల వల్ల జీవిత కాలం కూడా తగ్గుతుంది.
ఆర్థరైటిస్ కు కారణాలేంటి?
ఆటోఇమ్యూన్ రుమాటిక్ వ్యాధుల్లో కారణం ఏంటన్నది తెలియదు గానీ, రోగనిరోధక వ్యవస్థలో అసమతౌల్యం కొంతవరకు కారణం. రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువైతే గౌట్ వస్తుంది. ఎర్రమాంసం లేదా మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల లేదా వారసత్వంగా కూడా అది రావచ్చు.
ఆస్టియోఆర్థరైటిస్: ఊబకాయం, ఒకేచోట కూర్చుని పనిచేయడం, వృత్తిపరమైన కారణాలు (మైనర్లు, ఫుట్ బాలర్లు)
ఆర్థరైటిస్ లక్షణాలేంటి?
కీళ్ల దగ్గర నొప్పులు, వాపులు రావడం, కీళ్లపై ఉన్న చర్మం ఎర్రగా కందడం, ఉదయం సమయంలో కీలు బిగుతుగా ఉండి నొప్పి ఎక్కువ కావడం కీళ్లవాతం లక్షణాలు. కండరాల నొప్పులు, నీరసం, వికారం, కీళ్ల కదలికలు తగ్గడం, కీళ్లు వంకరపోవడం, ఉదయాన్నే వెన్ను కిందిభాగంలో బాగా నొప్పి, జుట్టు బాగా రాలడం, నోట్లో తరచు పుళ్లు, చర్మం మీద మచ్చలు, ముఖం మీద, సమస్య ఉన్నచోట ఎర్రటి దద్దుర్లు రావడం.
వేటి వల్ల రావచ్చు?
ఊబకాయం
పెరిగే వయసు
వృత్తి
మద్యపానం
ఎర్రమాంసం
ధూమపానం
జన్యు కారణాలు