దుబ్బాకలో తెరాసకు ఓటమి భయమా?
దుబ్బాకలో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే టిఆర్ఎస్ తమ శ్రేణులను రంగంలోకి దింపుతుందనే ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ సీటును ఎక్కడ తన్నుకుని పోతాయనే ఓటమి భయంతోనే టిఆర్ఎస్ పార్టీ హరీష్ రావును అక్కడ రంగంలోకి దింపినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే టిఆర్ఎస్ అనుమానానికి, భయానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే దుబ్బాక ఎన్నికలు అనివార్యమని తేలగానే బిజెపి నేత రఘునందన్ రావు అక్కడే స్థానికంగా ఉంటూ ప్రచారం ఎప్పుడో మొదలుపెట్టేశారు కూడా. ప్రజా వ్యతిరేక విధానాలు, రామలింగారెడ్డి కుమారుడు సతీష్ పై వస్తున్న ఆరోపణలు, సొంత పార్టీలో కుమ్ములాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూడా అక్కడ గట్టి అభ్యర్థినే దింపాలని భావిస్తోంది.
ఇక టికెట్ కోసం సోంత పార్టీలోనే ధిక్కార స్వరాలు వినిపించడంతో టిఆర్ఎస్ అంటే అక్కడి ప్రజల్లో కాస్త వ్యతిరేకత మొదలైంది. అలాగే ముత్యంరెడ్డి కుమారుడు, రామలింగారెడ్డి కుమారుడు తమకే టిక్కెట్ ఇవ్వాలనే స్వరాన్ని పెంచారు. ఈ క్రమంలో ఎక్కడ తమ సిట్టింగ్ స్థానం చేజారిపోతుందోననే ముందుజాగ్రత్తతోనే దుబ్బాక టీఆర్‌ఎస్‌లో ఎగసిపడుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు టీఆర్‌ఎస్ చీఫ్.. ట్రబుల్ షూటర్‌ను రంగంలోకి దింపారు. అలాగే అభ్యర్థి గెలుపు బాధ్యతలను కూడా హారీష్ రావుకే గులాబీ బాస్ అప్పగించినట్లు తెలుస్తోంది. రామలింగారెడ్డి భార్య సుజాతకే టిక్కెట్ దాదాపు ఖాయమైంది. మరీ హరీష్ రావు తనను గెలిపించుకొని ప్రగతి భవన్‌కు తీసుకెళ్తారో? లేదో చూడాలి మరీ.