అందుకే దుబ్బాకలో మాకం వేసిన పైసల మంత్రి
తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్‌ను ఏ ఎన్నికల్లోనూ ఓడించడం సాధ్యంకాదనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. అలాగే ఎన్నిక ఏదైనా అది టీఆర్ఎస్‌దే విజయమని, టిఆర్ఎస్‌ను ఓడించడం అంత సులువైనది కాదనే అభిప్రాయాన్ని కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు నుంచి మిగతా నేతలు కూడా చెప్తుంటారు. అందులో టీఆర్ఎస్ కంచుకోట సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్‌ను ఓడించాలనుకోవడం అంతా మామూలు విషయం కాదనే భావన చాలామందిలో ఉంది. కానీ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంత పొలిటికల్ రికార్డు, ట్రాక్ రికార్డు ఉన్న హరీష్ రావు గత కొంత కాలంగా తమ అభ్యర్థిని గెలుపించడం కోసం దుబ్బాకలోనే సెటిలయ్యారు.
టిఆర్‌స్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకకు ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇంకా ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూలే కన్ఫామ్ కాలేదు. అప్పుడే గత కొన్ని రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలోనే హరీష్ రావు మకాం వేసేశారు. తమకు తిరుగులేదనే వారు ఇక తమకు ఓటమి తప్పదనే భావనతోనే ఇలా ముందస్తుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు అనుకోవచ్చా అనే భావన వ్యక్తమవుతోంది.
సిట్టింగ్ చేజారకుండా..
సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన జర్నలిస్టుగా కూడా కొంత కాలం పనిచేశారు. గుండెపోటుతో ఆయన మరణించడంతో అక్కడ ఆ స్థానానికి బై ఎలక్షన్స్ అనివార్యమైంది. అయితే అది టిఆర్ఎస్‌కు సిట్టింగ్ స్థానం. సాధారణంగా ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా మరణిస్తే అక్కడ నిర్వహించే ఉప ఎన్నికల్లో మళ్లీ ఆ సీటును దాదాపు ఆ పార్టీయే కైవసం చేసుకుంటుంది. ఎక్కడో ఓచోట ఫలితాలు తారుమారవుతూ ఉంటాయి. టిఆర్ఎస్ పార్టికది సిట్టింగ్ స్థానమై ఉండడం, దుబ్బాక నియోజకవర్గం కూడా ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండడం వంటివి.. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు అవి అదనపు అర్హతలుగా చెప్పుకోవచ్చు. మరీ అలాంటప్పుడు.. దుబ్బాక ఎలక్షన్ అంటే టిఆర్ఎస్ టెన్షన్ పడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎక్కడ తమ సిట్టింగ్ స్థానం చేజారిపోతుందోనని భయంతోటే అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కెసిఆర్.. హరిష్ రావుకు ఇచ్చారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఏ ఎన్నికలైనా తమదే విజయం అనుకునే వారు… దుబ్బాకలోనే ఆ జిల్లా నేతలందరూ ఎందుకు అక్కడే మకాం వేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.