యువతలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు

  • ‘భావి’ తరాలరక్షణపై ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం 2020 దృష్టిపెట్టాలి

డెక్క‌న్ న్యూస్‌: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వార్త భారతదేశంలో ఆత్మహత్యలపై అందరూ ఆలోచించేలా చేసింది. ఈ ఘటన తర్వాత మానసిక ఆరోగ్యం కారణంగా సంభవించే మరణాల్లో అనేక కోణాలపై చర్చలు జరిగాయి. ఒకవైపు భారతదేశంతో పాటు ప్రపంచమంతా కొవిడ్-19 మహమ్మారితో అల్లకల్లోలం అవుతుంటే, ఇదే సమయంలో చాలామంది యువత తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండగా, అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రస్తుత పరిస్థితి, యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేస్తున్న ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనే మార్గాలపై ఒక్కసారి ఆలోచించాలి.
జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్.సి.ఆర్.బి.) లెక్కల ప్రకారం, భారతదేశంలో 2019 సంవత్సరంలో 1.39 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 67% మంది యువతే. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 4% ఎక్కువ! కుటుంబ సమస్యలతో పాటు ఉద్యోగంలో మరింత బాగా పనిచేయాలన్న ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, మానసిక ఆరోగ్యం, డ్రగ్స్, మద్యానికి అలవాటుపడటం లాంటివి యువతలో ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఈ సమస్యలు, వాటికి పరిష్కారాలపై కాంటినెంటల్ ఆసుపత్రుల కన్సల్టెంట్ సైకియాట్రిస్టు డాక్టర్ కోటిపల్లి జ్యోతిర్మయి మాట్లాడుతూ, ‘‘యువత ఆత్మహత్యలకు మానసిక అనారోగ్యం ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆ లక్షణాలను గుర్తించాల్సిన ప్రధాన బాధ్యత కుటుంబ సభ్యులదే! మరణం గురించి మాట్లాడటం, నిరాశగా కనిపించడం, జీవితాన్ని తిట్టిపోయడం, జీవితంలో భరించలేని బాధ/వేదన ఉన్నట్లు చెప్పడం, ఇతరులకు భారంగా ఉన్నామని చెప్పడం.. ఇవన్నీ ఆ లక్షణాలే. మద్యం, డ్రగ్స్ఎక్కువగా తీసుకోవడం, ఆందోళనగా లేదా కోపంగా కనిపించడం, నిర్లక్ష ప్రవర్తన, ఒంటరిగా ఉండిపోవడం కూడా అవే లక్షణాలు’’ అన్నారు.
‘‘ఆత్మహత్య ఆలోచనలు, ప్రవర్తలకు దారితీసే ముప్పు లక్షణాలను తగ్గించేందుకు కొన్ని రెసిలియెన్సీ కారకాలు ఉంటాయి. పిల్లలు గానీ, యుక్తవయస్కులు గానీ ముప్పులో ఉంటే పాఠశాలలు, కుటుంబాలు, స్నేహితులు కలిసి వాళ్లకు ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండేలా సాయపడాలి. కుటుంబ అనుబంధాలు, తోటివారి మద్దతు, సన్నిహిత సామాజిక సంబంధాలు, పాఠశాల, సాంస్కృతిక, ఆద్యాత్మిక నమ్మకాల ద్వారా ఆత్మహత్యలను నివారించి, ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు తోడ్పడతాయి. వారి మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి’’ అని డాక్టర్ జ్యోతిర్మయి తెలిపారు.
ఆత్మహత్యలను నివారించవచ్చు. చాలా సందర్భాలలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తులు కుటుంబానికి, స్నేహితులకు, తన చుట్టూ ఉన్న సమాజానికి కొన్ని సంకేతాలు పంపుతారు. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా వాళ్లకు కొద్దిపాటి సాయం చేయాలి. అప్పుడు వాళ్ల ప్రవర్తనను మార్చి, మంచి భవిష్యత్తు ఉన్న జీవితాన్ని కాపాడవచ్చు.