దేశంలోనే తొలిసారిగా కొవిడ్ రోగికి కిమ్స్ ఆసుప‌త్రిలో రెండు ఊపిరితిత్తుల మార్పిడి

డెక్క‌న్ న్యూస్ : భార‌త‌దేశంలో ప్ర‌ధాన‌మైన ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) వైద్యులు దేశంలోనే తొలిసారిగా కొవిడ్ పాజిటివ్ రోగికి రెండు ఊపిరితిత్తులు మార్చారు. ఆ వ్య‌క్తి ఆసుప‌త్రి నుంచి శుక్ర‌వారం డిశ్ఛార్జి అయ్యారు. హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రి ప్ర‌ధాన‌శాఖ‌లో ఈ శ‌స్త్రచికిత్స చేశారు. భార‌త‌దేశంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శ‌స్త్రచికిత్స‌ల‌కు ఆద్యుడిగా పేరొందిన డాక్ట‌ర్ సందీప్ అట్టావ‌ర్ నేతృత్వంలో ఈ చికిత్స జ‌రిగింది.
రిజ్వాన్ (మోను) అనే 32 ఏళ్ల వ్య‌క్తి స్వ‌స్థ‌లం పంజాబ్‌లోని చండీగ‌ఢ్‌. అత‌డి ఊపిరితిత్తుల‌కు తీవ్రంగా స‌ర్కోయిడోసిస్ రావ‌డంతో అవి తంతీక‌ర‌ణం చెంద‌డం మొద‌లైంది. రోగి ప‌రిస్థితి చాలా వేగంగా క్షీణించ‌సాగింది. అలాంటి ప‌రిస్థితుల్లో రెండు ఊపిరితిత్తులు మార్చ‌డమే ఏకైక ప‌రిష్కారం. గ‌త ఎనిమిది వారాల్లో అత‌డికి ఇచ్చే ఆక్సిజ‌న్ నిమిషానికి 15 లీట‌ర్ల నుంచి 50 లీట‌ర్ల‌కు పెరిగేంత‌గా ప‌రిస్థితి విష‌మించింది.
ఈ ప‌రిస్థితిపై కిమ్స్ ఆసుప‌త్రుల‌కు చెందిన కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌లోని థొరాసిక్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ సందీప్ అట్టావ‌ర్ మాట్లాడుతూ, “ఈ రోగి ఊపిరితిత్తుల‌కు స‌ర్కోయిడోసిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కొవిడ్ కార‌ణంగా అప్ప‌టికే పాడైన ఊపిరితిత్తులు మ‌రింత దెబ్బ‌తిన్నాయి. కోల్‌క‌తాలో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్య‌క్తి ఊపిరితిత్తులు అదృష్ట‌వ‌శాత్తు ఇత‌డికి స‌రిపోయాయి. వాటిని విమానంలో హైద‌రాబాద్‌కు తీసుకొచ్చి, ఇత‌డికి అమ‌ర్చ‌డం ద్వారా ప్రాణాలు కాపాడ‌గ‌లిగాం. ఇది చాలా సంక్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. ఏమాత్రం పొర‌పాట్లు జ‌ర‌గ‌డానికి వీల్లేదు. స‌రైన స‌మ‌యానికి ఊపిరితిత్తులు మార్చ‌డం వ‌ల్లే రోగిని కాపాడే అవ‌కాశం వ‌చ్చింది. ఈ త‌ర‌హా రోగులు తీవ్రంగా అనారోగ్యం బారిన ప‌డ‌టం, పోష‌కాహార లోపం, ఊపిరితిత్తుల మార్పిడికి ముందు మంచాన ప‌డ‌టంతో ఇలాంటివారికి శ‌స్త్రచికిత్స చేసినా ఫ‌లితాలు ఒకోసారి స‌రిగా రావు. డిశ్ఛార్జి చేసిన త‌ర్వాత కూడా అత‌డిని జాగ్ర‌త్త‌గా ప‌రీక్షించాలి, బ‌యో బ‌బుల్ వాతావ‌ర‌ణంలో ఉంచి క‌నీసం 6 వారాల పాటు మందులు జాగ్ర‌త్త‌గా ఇస్తుండాలి” అని తెలిపారు.
దేశంలోనే గుండె, ఊపిరితిత్తుల మార్పిడిలో అత్యంత అనుభ‌వ‌జ్ఞులు డాక్ట‌ర్ సందీప్ అట్టావ‌ర్‌. ఈ రంగంలో ఆయ‌న‌కు 24 ఏళ్ల అనుభ‌వం ఉంది. ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు 12,000 గుండె శ‌స్త్రచికిత్స‌లు, 250కి పైగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శ‌స్త్రచికిత్స‌లు, కృత్రిమ గుండె ప‌రిక‌రాల (ఎల్‌వీఏడీ) అమ‌రిక లాంటి క్లిష్ట‌మైన చికిత్స‌లు విజ‌య‌వంతంగా చేశారు.
ప్ర‌పంచ‌వ్యాప్తంగాను, భార‌త‌దేశంలోను ప్ర‌స్తుత ప‌రిస్థితి వ‌ల్ల రోగులు దీర్ఘ‌కాలం పాటు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌స్తోంది. కొన్ని వ్యాధుల‌ను పట్టించుకోక‌పోవ‌డం/ నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల‌, స‌రైన స‌మ‌యానికి చికిత్స చేయించుకోక‌పోవ‌డంతో వ్యాధులు మ‌రింత ముదిరిపోతున్నాయి. అందువ‌ల్ల త‌మ‌కు వ‌స్తున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి, వాటి ల‌క్ష‌ణాల గురించి రోగులు అవ‌గాహ‌న పెంచుకుని, స‌రైన స‌మ‌యానికి చికిత్స‌లు చేయించుకోవాలి.
కిమ్స్ గురించి:
కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అతిపెద్ద కార్పొరేట్ ఆసుప‌త్రి. సికింద్రాబాద్‌, కొండాపూర్‌, నెల్లూరు, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, శ్రీ‌కాకుళం, ఒంగోలు, విశాఖ‌ప‌ట్నం, అనంత‌పురం, క‌ర్నూలు న‌గ‌రాల్లో ఈ ఆసుప‌త్రులు ఉన్నాయి. మొత్తం 9 ఆసుప‌త్రులలో 3000 బెడ్లు ఉన్నాయి. “కిమ్స్ హాస్పిట‌ల్స్” బ్రాండ్ కింద స్పెషాలిటీలు, సూప‌ర్ స్పెషాలిటీ వైద్యాల‌తో కూడిన స‌మ‌గ్ర చికిత్స‌ల‌ను ఈ గ్రూపు అందిస్తుంది. గ్రూపు ప్ర‌ధాన కేంద్రం ‌సికింద్రాబాద్‌లో ఉంది. వెయ్యి ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో దేశంలోనే ఒకే ప్రాంతంలో ఉన్న అతిపెద్ద ప్రైవేటు ఆసుప‌త్రుల‌లో ఇదొక‌టి.
డాక్ట‌ర్ సందీప్ అట్ట‌వార్ గురించి:
52 ఏళ్ల వ‌య‌సున్న డాక్ట‌ర్ అట్టావ‌ర్‌ గ‌త 24 ఏళ్లుగా వైద్య‌రంగంలో ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 12 వేల‌కు పైగా గుండె శ‌స్త్రచికిత్స‌లు చేశారు. 250 అవ‌య‌వ మార్పిడి చికిత్స‌లు చేశారు. వాటిలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడితో పాటు కృత్రిమ గుండె అమ‌రిక‌లు కూడా ఉన్నాయి. అన‌ల్స్ ఆఫ్ థొరాసిక్ స‌ర్జ‌రీ లాంటి ప్ర‌ఖ్యాత వైద్య‌ప‌త్రిక‌ల‌లో డాక్ట‌ర్ అట్ట‌వార్ గురించి త‌ర‌చు వ‌స్తుంటుంది. ప్ర‌స్తుతం ఆయ‌న భార‌త‌దేశం, ఆగ్నేయాసియాకు జార్విక్ హార్ట్ అండ్ హార్ట్ మేట్ 3కి ప్రోక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
డాక్ట‌ర్ అట్టావ‌ర్ అహ్మ‌దాబాద్‌లోని ఎన్‌హెచ్ఎల్ మునిసిప‌ల్ మెడిక‌ల్ కాలేజిలో ఎంబీబీఎస్, ఎంఎస్ చేశారు. త్రివేండ్రంలోని శ్రీ చిత్రతిరున‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో కార్డియాక్ స‌ర్జ‌రీలో ఎంసీహెచ్ పూర్తిచేశారు.